contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మార్గదర్శకం : సుధాకర్

  • నిరసనలను అణచివేతతో కాదు.. సంభాషణతో ఎదుర్కోవాలి: జాతీయ అధ్యక్షుడు సుధాకర్

 

హైదరాబాద్ : ఇటీవల జరిగిన ‘సంసద్ చలో’ విద్యార్థి ఉద్యమానికి సంబంధించిన విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం చేసిన కీలక వ్యాఖ్యలను భారత పౌర సమాజం హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా, జాతీయ అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్ట్ , సుధాకర్ పేర్కొన్నారు.

ఆయన మాట్లాడుతూ.. “వినడమే బలమైన ఆయుధం” అంటూ నిరసనకారుల ఆవేదనను ఓపికగా వినాలని, “కౌన్సెలింగ్‌తో శాంతింపజేయాలి” అంటూ దారితప్పిన యువతపై దూకుడు ప్రదర్శించవద్దని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు నిలువెత్తు నిదర్శనమని అన్నారు. అలాగే “హింసకు హింస సమాధానం కాదు” అనే సుప్రీంకోర్టు సూత్రం దేశంలో శాంతిభద్రతల పరిరక్షణకు కొత్త దిశానిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు.

నిరసనల సందర్భంగా సీసీటీవీ, డ్రోన్, బాడీ కెమెరా వీడియోలు, పీసీఆర్ లాగ్‌లను తప్పనిసరిగా భద్రపరచాలని, నిరసనకారుల వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయరాదని కోర్టు ఇచ్చిన ఆదేశాలు అత్యంత స్వాగతించదగినవని సుధాకర్ అభిప్రాయపడ్డారు.

అదేవిధంగా నేర చరిత్ర లేని మైనర్ విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని, సాధారణ విద్యార్థులపై కఠిన చర్యలకు పాల్పడవద్దని, అవసరమైతే ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకునే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం యువతకు గొప్ప ఊరటనిచ్చే నిర్ణయమని అన్నారు.

లాఠీచార్జ్ ఘటనలపై స్వతంత్ర దర్యాప్తుకు సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేయడం న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తుందని సుధాకర్ పేర్కొన్నారు. ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థలు సుప్రీంకోర్టు సూచించిన మార్గదర్శకాలను అక్షరాలా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించే సంస్కృతికి ప్రాధాన్యం ఇవ్వాలని, నిరసనలను అణచివేతతో కాకుండా సంభాషణ, సంయమనంతో ఎదుర్కోవాలని ఆయన సూచించారు. రాజ్యాంగం కల్పించిన శాంతియుత నిరసన హక్కును పరిరక్షిస్తూ, దేశ భవిష్యత్తుకు యువతను భాగస్వాములను చేసే దిశగా అన్ని వర్గాలు కృషి చేయాలని సుధాకర్ పిలుపునిచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :