ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల విద్యా, ఉపాధి హక్కుల పరిరక్షణ కోసం జీఓ-3ను తక్షణమే పునరుద్ధరించాలని పౌర సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏజెన్సీ ప్రాంతాల విద్యాభివృద్ధికి, గిరిజన యువత ఉపాధి అవకాశాలకు జీఓ-3 కీలకంగా దోహదపడిందని సంఘం నాయకులు పేర్కొన్నారు.
పౌర సంక్షేమ సంఘం ప్రతినిధులు దూసర్లపూడి రమణరాజు, సులేమాన్, యేసుప్రసాద్ మాట్లాడుతూ, జీఓ-3 పునరుద్ధరణ కోసం నెలల తరబడి ఆదివాసీలు, గిరిజన నిరుద్యోగ యువత శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు.
పెద్ద కార్పొరేట్ సంస్థలకు ప్రాజెక్టులు, పారిశ్రామిక రాయితీల కోసం ప్రభుత్వం వేగంగా జీఓలు జారీ చేస్తోందని, అయితే దశాబ్దాలుగా అడవుల్లో జీవిస్తున్న గిరిజనుల విద్యా, ఉపాధి హక్కుల విషయంలో మాత్రం నిర్లక్ష్య ధోరణి అవలంబించడం అన్యాయమని విమర్శించారు.
సుప్రీంకోర్టు తీర్పును అధిగమించేలా న్యాయపరంగా నిలదొక్కుకునే బలమైన ప్రత్యామ్నాయ చట్టం లేదా ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం వెంటనే తీసుకురావాలని వారు కోరారు. అలాగే రాబోయే ఉపాధ్యాయ నియామకాల్లో స్థానిక గిరిజన యువతకు ఎలాంటి నష్టం జరగకుండా చట్టపరమైన రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకముందే ఆదివాసీ సంఘాల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని పౌర సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. గిరిజన యువత తమ హక్కుల కోసం చేస్తున్న న్యాయమైన పోరాటానికి సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు నాయకులు స్పష్టం చేశారు.








