- శరవేగంగా కొనసాగుతున్న ఉత్సవ ఏర్పాట్లు
- ఏలాంటి లోటు పాట్లు లేకుండా జరపాలని ఆదేశం
- బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై చెవిరెడ్డి సమీక్ష
తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సూచించారు. అక్టోబర్ 3 నుంచి 12వ తెదీ వరకు నిర్వహించే ఉత్సవాలకు అవసరమైన ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలన్నారు. శనివారం ఆలయం వద్ద కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుమల తరహాలో భక్తులను ఆకట్టుకునేలా ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేయాలన్నారు. ఆలయంతో పాటు స్వామి వారి వాహనం విహరించే అన్ని ప్రాంతాల్లో బ్రహ్మోత్సవ కళ ఉట్టిపడేలా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
ఇప్పటికే ప్రారంభమైన ఏర్పాట్లు
తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఆలయం వద్ద చలువ పందిరిలు, రంగుల ముగ్గులతో ఎంతో అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఆలయంతో పాటు గ్రామం రంగు రంగుల విద్యుత్ తీగలతో కటౌట్లతో దేదీప్యమానంగా విరాజిల్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల వివరాలు
ఈనెల 3వతేదీ సాయంత్రం 4 గంటలకు జరిగే అంకురార్పణతో పాటు సేనాధిపతి ఉత్సవం, 4వ తేదీ ఉదయం 6గంటలకు ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. 4వతేదీ రాత్రి 7 గంటలకు పెద్ద శేష వాహనం, 5వ తేదీ ఉదయం 7గంటలకు చిన్నశేష వాహనం, రాత్రి 7గంటలకు హంస వాహనం, 6వ తేదీ ఉదయం 7గంటలకు సింహ వాహనం, రాత్రి 7గంటలకు ముత్యపు పందిరి వాహనం, 7వతేదీ ఉదయం 7గం” కల్పవృక్ష వాహనం, రాత్రి 7గం” సర్వభూపాల వాహనం, 8వ తేదీ ఉదయం 7గం” మోహినీ అవతారం, రాత్రి 7గం” గరుడ వాహనం, 9వ తేదీ ఉదయం 7గం” హనుమంత వాహనం, రాత్రి 7గం” గాజ వాహనం, 10వ తేదీ ఉదయం 7గం” సూర్య ప్రభ వాహనం, రాత్రి 7గం” చంద్రప్రభ వాహనం, 11వ తేదీ ఉదయం 7గం ” రథోత్సవం, రాత్రి 7గం” అశ్వవాహనం, 12వ తేదీ ఉదయం 6గంటల నుంచి 9 గంటల వరకు చక్రస్నానం, రాత్రి 7గం” ధ్వజారోహణంతో ఉత్సవాలు ముగిస్తారు.