నేషనల్ హైవే పై టోల్ చార్జీలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో మాదిరిగా ఉన్నాయి. రహదారిపైకి వచ్చిన వారికి ఈ చార్జీల పట్ల పెద్దగా అవగాహన ఉండదు. చార్జీల గురించి ముందే తెలుసుకుంటే అందుకు తగ్గట్టు ట్రిప్ ను ప్లాన్ చేసుకోవడం వీలు పడుతుంది. గూగుల్ మ్యాప్స్ కూడా ఇదే ఆలోచించింది. యూజర్ల సౌలభ్యం కోసం టోల్ చార్జీల వివరాలను తెలుసుకునే సదుపాయాన్ని త్వరలోనే తీసుకురానున్నట్టు ప్రకటించింది.
ట్రిప్ ఆరంభానికి ముందే గూగుల్ మ్యాప్స్ లో లొకేషన్ ను టైప్ చేసి మార్గంలోని టోల్ ప్లాజాల వద్ద చార్జీలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే వెసులుబాటు ఈ ఫీచర్ తో ఉంటుంది. దీంతో ఆ మార్గంలో వెళ్లేందుకు మొత్తం టోల్ చార్జీ ఎంత అవుతుందో తెలిసిపోతుంది. దీనివల్ల టోల్ చార్జీలు తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంపిక చేసుకునే వీలు కూడా కలుగుతుంది.
వెళుతున్న మార్గంలో టోల్ చార్జీలు సుమారుగా ఎంత ఉండొచ్చన్న వివరాలను గూగుల్ మ్యాప్స్ తెలియజేస్తుంది. కొన్ని సందర్భాల్లో వాస్తవ రేట్లు కొంత వేరుగా ఉండే అవకాశం లేకపోలేదు. గూగుల్ మ్యాప్స్ తెరచి డైరెక్షన్ చూస్తున్న పేజీపై భాగంలోని మూడు డాట్స్ వద్ద ట్యాప్ చేస్తే అక్కడ టోల్ చార్జీల్లేని మార్గాల వివరాలు కూడా ఉంటాయి. ఈ నెలలోనే ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు గూగుల్ ప్రకటించింది. భారత్, యూఎస్, జపాన్, ఇండోనేషియాలో మొత్తం 2,000 రహదారులకు సంబంధించి టోల్ వివరాలను తొలుత అందించనున్నట్టు తెలిపింది.