తిరుపతి : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు, పోలీసుల ముసుగులో ప్రైవేటు వ్యక్తులు దాడులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని అఖిలభారత అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది చింతమకుల పుణ్యమూర్తి అన్నారు.
మంగళవారం శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారం వద్ద అఖిలభారత అంబేద్కర్ యువజన సంఘం, బహుజన ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఎస్వీయూ శాఖ) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పుణ్యమూర్తి, తమ హక్కుల సాధన కోసం శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులను తీవ్రవాదులుగా చిత్రీకరిస్తూ వారిపై బలప్రయోగానికి దిగడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు.
భారతదేశం ప్రజాస్వామ్య సూత్రాలు, చర్చలు, భావ ప్రకటనా స్వేచ్ఛ వంటి రాజ్యాంగబద్ధ హక్కులపై నిర్మితమైన దేశమని, అలాంటి దేశంలో విద్యార్థుల్లో భయాందోళనలు సృష్టించే విధంగా వ్యవహరించడం అత్యంత విచారకరమని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో బహుజన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తిరుపతి జిల్లా కన్వీనర్ శివాజీ, శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ అధ్యక్షులు రఘు, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం అధ్యక్షులు, కార్యదర్శులు సంగీతం సుబ్రహ్మణ్యం, పద్మనాభం, అలాగే దార్ల రఘురాములు, ఈశ్వరయ్య గౌడ్, ప్రతాప్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
నిరసనలో పాల్గొన్న బహుజన ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు, సభ్యులు విద్యార్థులపై జరిగినట్లు ఆరోపణలు వచ్చిన దాడిని ఖండిస్తూ, భావ ప్రకటనా స్వేచ్ఛను, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.









