తిరుపతి – చౌడేపల్లి: ప్రభుత్వ ఆదేశాల మేరకు చౌడేపల్లి మండలం బోయకొండలోని ప్రముఖ శక్తి క్షేత్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ వరుణ యాగం, వరుణ జపం కార్యక్రమాలను ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ మధుసూదన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ ఈవో, డిప్యూటీ కమిషనర్ ఏకాంబరం ఆలయ సంప్రదాయాల ప్రకారం పూర్ణకుంభ స్వాగతం పలికారు.
అనంతరం ఆలయంలో మధుసూదన్ నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరుణ యాగం, వరుణ జపంలో భాగంగా నిర్వహించిన హోమ కార్యక్రమంలో పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు. ప్రజలు, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మధు రాయల్, జనసేన పార్టీ పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ చిన్న రాయల్, బీజేపీ ఇన్చార్జ్ మదన్మోహన్, నాయకుడు బోయకొండ సుబ్బారెడ్డి తదితరులతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.








