తిరుపతి జిల్లా : పాకాల మండల పరిధిలోని చిన్నంగారి గ్రామం సమీప అటవీ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట శిబిరంపై బుధవారం సాయంత్రం పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో 15 మంది జూదరులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి భారీగా నగదు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే, చిన్నంగారి గ్రామ పరిసరాల్లోని అటవీ ప్రాంతంలో కొంతకాలంగా పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో పాకాల సి.ఐ. చిన్న గోవిందు, ఎస్.ఐ. తరుణ్ తమ సిబ్బందితో కలిసి బుధవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టి దాడి చేపట్టారు. పోలీసుల రాకను గమనించిన జూదరులు పరారయ్యే ప్రయత్నం చేసినప్పటికీ, అప్రమత్తమైన పోలీసులు 15 మందిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వద్ద నుంచి రూ.45,500 నగదు, 14 మొబైల్ ఫోన్లు, 4 మోటార్ సైకిళ్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సి.ఐ. చిన్న గోవిందు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండల పరిధిలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు సాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జూదం కారణంగా అనేక కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని, ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచుతామని స్పష్టం చేశారు.









