గుత్తి : గుత్తి మండల కేంద్రంలో శిథిలావస్థకు చేరుకున్న పాత ఆర్టీసీ బస్టాండ్ స్థానంలో నూతన బస్టాండ్ నిర్మాణానికి ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు శనివారం నూతన బస్టాండ్ నిర్మాణ పనులకు ఆర్టీసీ అధికారులు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి టిజి భరత్‌తో పాటు అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు పూల నాగరాజు, రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకటశివుడు యాదవ్ హాజరయ్యారు. వీరితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా రాష్ట్రవ్యాప్తంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు.
అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నూతన పథకాలను అమలు చేస్తూ, రాష్ట్రంలో అనేక వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నారని నాయకులు ప్రశంసించారు. నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణంతో గుత్తి ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్డీఏ కూటమి నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.








