contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కుష్ఠువ్యాధి రహిత సమాజమే లక్ష్యం .. “స్పర్శ” అవగాహన కార్యక్రమం

జియ్యమ్మవలస, పార్వతీపురం మన్యం జిల్లా : కుష్ఠువ్యాధిపై అపోహలను వీడి, వ్యాధి రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా జియ్యమ్మవలస మండలం రావాడ రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో “స్పర్శ” జాతీయ కుష్ఠువ్యాధి నివారణ అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం స్థానిక వైద్యాధికారుల నేతృత్వంలో జరిగి, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కేవలం ఆసుపత్రి ప్రాంగణానికే పరిమితం కాకుండా వైద్య బృందం గ్రామంలోని వీధివీధిన పర్యటిస్తూ ప్రజలకు కుష్ఠువ్యాధిపై అవగాహన కల్పించారు. ఇంటింటి సర్వే నిర్వహిస్తూ వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలపై వివరించారు.

ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, చర్మంపై స్పర్శ లేని, రంగు మారిన మచ్చలు కనిపిస్తే అవి కుష్ఠువ్యాధి లక్షణాలు కావచ్చని తెలిపారు. అటువంటి లక్షణాలు గమనించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కుష్ఠువ్యాధి పూర్తిగా నయం చేయదగిన వ్యాధి అని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందించే ఎం.డీ.టీ (MDT) మందుల ద్వారా వంద శాతం నయం అవుతుందని స్పష్టం చేశారు.

అలాగే కుష్ఠువ్యాధిగ్రస్తులను భయంతో దూరం పెట్టడం లేదా వివక్ష చూపడం సరికాదని, వారిని ప్రేమతో ఆదరించి సకాలంలో చికిత్స అందేలా చూడడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని తెలిపారు. ఇంటింటి సర్వేకు వచ్చే వైద్య సిబ్బందికి గ్రామస్తులు పూర్తిస్థాయిలో సహకరించి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

దేశాన్ని సంపూర్ణ కుష్ఠువ్యాధి రహితంగా మార్చినప్పుడే ప్రజా ఆరోగ్యం మెరుగుపడుతుందని, తద్వారా ఆయుర్దాయం పెరుగుతుందని వైద్యాధికారులు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవగాహన కార్యక్రమంలో భాగస్వాములై సమాజానికి ఆరోగ్య భవిష్యత్తు అందించాలంటూ వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ సుస్మిత, డాక్టర్ దిలీప్ కుమార్, ఈవో పి. శ్రీనివాసరావు, హెల్త్ విజిటర్ ఈస్టరు రాణి, ల్యాబ్ టెక్నీషియన్ సురేష్ కుమార్‌తో పాటు ఇతర వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :