అనంతపురం జిల్లా పెద్ద వడుగూరు మండల కేంద్రము లో ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మె గోడ పత్రికలు సోమవారం ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ చంద్రశేఖర్ రెడ్డి, రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శులు డి దస్తగిరి,సి చెన్నారెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అమెరికాకు లొంగిపోయి ఏకపక్షంగా అమెరికాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంది. ఈ అగ్రిమెంట్ అమలు అయితే అమెరికా నుండి మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ తదితర పంటలు, పాలు, పాల పదార్థాలు ఎలాంటి దిగుమతి సుంకాలు లేకుండా పెద్ద ఎత్తున దేశంలోకి దిగుమతి అవుతాయి. అమెరికాలో వ్యవసాయ రంగానికి అక్కడి ప్రభుత్వం 50% సబ్సిడీ ఇస్తుంది. మన మనదేశంలో వ్యవసాయ రంగానికి భారత ప్రభుత్వం 3% శాతం మాత్రమే సబ్సిడీ ఇస్తుంది. మన దేశ వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులతో పోల్చితే అమెరికా వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు చాలా చౌక. చౌకగా ఉత్పత్తి అయిన అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు ఈ ఒప్పందంతో మనదేశంలోకి విచ్చలవిడిగా వస్తాయి. మన రైతాంగం పండించిన పంటలు అమ్ముకునే దారి లేక దివాళా తీస్తారు. 65% జనాభా ఆధారపడి ఉన్న మన వ్యవసాయ రంగం చతికిలబడుతుంది. 9 కోట్ల మంది పాడి రైతులు దివాలా తీస్తారు. మనదేశంలోకి వచ్చే వస్తువులపై ఎలాంటి పన్నులు ఉండవు. మన దేశం నుండి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువుల పైన 18 శాతం పన్నులు అమెరికా విధిస్తుంది. మన ఎగుమతులు నిలిచిపోతాయి. మనదేశంలోకి దిగుమతులు ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి. ఢిల్లీ ఉద్యమం సందర్భంగా రైతు సంఘాలకు ఇచ్చిన హామీలు అమలు పరచకుండా మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని మరొకసారి మోసగించింది. రైతులు పండించే పంటలకు మద్దతు ధరల అమలు చట్టం గురించి మాట్లాడటం మానేసింది. ఎరువుల మీద సబ్సిడీలు తగ్గించి ఎరువులు ధరలు పెంచుతున్నది. 2026-27 కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో లో ఎరువులపై సబ్సిడీ తగ్గించింది. ఆటోమేటిక్ గా ఎరువులు,పురుగుమందుల ధరలు పెరుగుతాయి. గత సంవత్సరం యూరియా కొరత రైతులను ఎలా వేధించిందో మనం చూశాము. విత్తన చట్టం, విద్యుత్ చట్టాలలో మార్పులు చేస్తున్నది. విత్తనంపై రైతు హక్కు కోల్పోతాడు. వేళ్ళ మీద లెక్కించే ప్రైవేటు కంపెనీల గుత్తాధిపత్యం పెరుగుతుంది. విద్యుత్ చట్టం 2025 ద్వారా స్మార్ట్ మీటర్లు అమల్లోకి వస్తాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఉండదు. మోటార్లతో సాగించే వ్యవసాయం భారమవుతుంది. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ను రద్దుచేసి, పేదలకు ఉపాధి లేకుండా చేసే 2025 ఉపాధి చట్టాన్ని తీసుకువచ్చింది. 90 శాతం నిధులను 60 శాతానికి తగ్గించింది. మోసపూరితంగా 125 రోజుల పని దినాల గురించి ప్రచారం చేస్తున్నది. నిధులు తగ్గిపోతే పని దినాలు పెరుగుతాయా అన్ని ప్రశ్నించారు.
ఈ విధానాలకు నిరసనగా గ్రామ గ్రామాన ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
డిమాండ్స్:
1. సి2+50% ప్రకారం పంటల మద్దతు ధరల చట్టం చేయాలి.
2. విత్తన విద్యుత్ మార్కెట్ చట్టాలు ఉపసంహరించాలి.
3. కౌలు రైతులకు అన్ని పథకాలు అమలు అయ్యేలాగా,అన్నదాత సుఖీభవ, నూతన కౌలు చట్టాన్ని చేయాలి. పంట రుణాలు ఇవ్వాలి
4. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2005ను పునరుద్ధరించాలి. 2025 ఉపాధి చట్టాన్ని రద్దు చేయాలి. 200 రోజులకు పని పెంచి కూలి 600 రూపాయలు పెంచి అమలు చేయాలి.
5. కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి.
6. బలవంతపు భూసేకరణ ఆపాలి 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలి.
ఈ కార్యక్రమంలో సుధీర్ రెడ్డి, దుర్గమ్మ, సుంకన్న, మస్తాన్, వెంకటరాముడు, జానకిరామ్ రెడ్డి తదితర నాయకులు రైతులు పాల్గొన్నారు.







