జగిత్యాల జిల్లా, మెట్పల్లి: బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రెండవసారి బాధ్యతలు స్వీకరించిన అనంతరం, తన స్వగ్రామమైన కోరుట్లకు తొలిసారి విచ్చేసిన సురభి నవీన్‌కు మెట్పల్లి–కోరుట్ల నియోజకవర్గ బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
మెట్పల్లి పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద నుంచి భారీ బైక్ ర్యాలీగా ప్రారంభమైన ఈ స్వాగత కార్యక్రమం కోరుట్ల పట్టణంలోని ఆయన నివాసం వరకు కొనసాగింది. మార్గమధ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పాల్గొని నినాదాలతో ఉత్సాహం నింపారు.
కోరుట్ల బస్ స్టేషన్ ఔట్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో కార్యకర్తలనుద్దేశించి సురభి నవీన్ ప్రసంగించారు. “బీజేపీ అంటే కార్యకర్తల పార్టీ. కార్యకర్తలు లేకుండా ఏ నాయకుడూ ఉండడు. ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా కుటుంబ సభ్యుడిలా మీకు అండగా ఉంటాను. నా చివరి శ్వాస వరకు కాషాయాన్ని విడిచేది లేదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదురొడ్డి పోరాడుతాను” అని తెలిపారు.
అలాగే తనపై నమ్మకం ఉంచి రెండవసారి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మరియు పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఆయన నివాసం వరకు బైక్ ర్యాలీగా చేరుకుని, రెండవసారి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బీజేపీ శ్రేణులు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మెట్పల్లి, కోరుట్ల నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.








