జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో గుర్తుతెలియని దొంగలు రెండు దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని బీభత్సం సృష్టించారు. ఇబ్రహీంపట్నం గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం, గోధురు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు.
దొంగలు ఇబ్రహీంపట్నంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలోని బంగారు, వెండి ఆభరణాలను అపహరించినట్లు సమాచారం. అలాగే గోధురు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు మొక్కుబడిగా సమర్పించిన హుండీని పగులగొట్టి అందులోని నగదును దోచుకెళ్లారు.
ఈ ఘటనతో ఇరు గ్రామాల భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దేవాలయాల భద్రతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను కోరుతున్నారు.
ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన చెట్లపల్లి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు.
ఈ సందర్భంగా ఎస్సై జి. నవీన్ మాట్లాడుతూ, ఘటనపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని, త్వరలోనే నిందితులను గుర్తించి అరెస్టు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక ప్రాంతాల్లో సీసీటీవీ దృశ్యాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.








