- కరీంనగర్లో ఘనంగా ‘అరైవ్ – అలైవ్’ రోడ్డు భద్రత వారోత్సవాలు
కరీంనగర్: రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం ప్రదర్శించకూడదని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా తెలంగాణ పోలీసు శాఖ నిర్వహిస్తున్న “అరైవ్ – అలైవ్” (Arrive – Alive) రోడ్డు భద్రత వారోత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన శుక్రవారం కరీంనగర్‌కు విచ్చేశారు.
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని అస్త్ర కన్వెన్షన్ హాలులో నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీల అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీజీపీ, రోడ్డు ప్రమాదాల నివారణపై పలు కీలక సూచనలు చేశారు.
ఇటీవల సంగారెడ్డిలో జరిగిన విషాద ఘటనను ప్రస్తావిస్తూ, ఒక రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందడంతో ఆ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. ఒకరి నిర్లక్ష్యం నిండు కుటుంబాన్ని ఎలా దెబ్బతీస్తుందో ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు.
వాహనదారులు డిఫెన్సివ్ డ్రైవింగ్ పాటించాలని, కేవలం డ్రైవింగ్‌పైనే కాకుండా చుట్టూ ఉన్న పరిస్థితులను గమనిస్తూ వాహనం నడపాలని సూచించారు. అలాగే “3 సెకండ్స్ బ్రేక్ రూల్”ను కచ్చితంగా అమలు చేయాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాల్లో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితులు తమ అనుభవాలను పంచుకోవడంతో సభికులు కంటతడి పెట్టారు. ఆ గాథలు ప్రతి వాహనదారునికి ఒక హెచ్చరికగా ఉండాలని డీజీపీ అన్నారు. బాధిత కుటుంబాలకు పోలీసు శాఖ తరఫున ఆర్థిక సహాయం అందజేశారు.
అలాగే రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన “లెటర్ టూ ఎ ఫాదర్”, వ్యాస రచన పోటీల విజేతలకు డీజీపీ చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు. ప్రమాదానికి గురైన బాధితులను ‘గోల్డెన్ అవర్’లో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారిని ప్రత్యేకంగా సత్కరించారు.
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో గ్రామ, వార్డు స్థాయిల్లో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించాలని, ప్రజల రక్షణ కోసం పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని డీజీపీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.








