తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ చెన్నై నగరాన్ని లక్ష్యంగా చేసుకుని ‘చెన్నై సూపర్ 6’ పేరుతో ప్రత్యేక ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేశారు. నగర మౌలిక సదుపాయాలు, రవాణా, పట్టణ సౌకర్యాలు, భవిష్యత్ ఆర్థిక వృద్ధి వంటి ఆరు కీలక రంగాల్లో మొత్తం 20 హామీలను ఇందులో ప్రకటించారు.
పట్టణ రవాణా వ్యవస్థను మెరుగుపరచడంలో భాగంగా చివరి మైలు కనెక్టివిటీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నగరంలోని వీధులను బస్టాప్‌లు, మెట్రో స్టేషన్లు, రైల్వే కేంద్రాలతో అనుసంధానించేందుకు 1,000 కొత్త మినీ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు హామీ ఇచ్చారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించి ప్రయాణ సమయాన్ని 25 శాతం వరకు తగ్గించేందుకు ఏఐ ఆధారిత ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు తెలిపారు.
మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా కీలక ప్రాజెక్టులకు స్పష్టమైన గడువులను నిర్దేశించారు. ఎన్నూర్ నుంచి పూంజేరి వరకు చెన్నై పెరిఫెరల్ రోడ్ సహా పదికి పైగా ప్రధాన ప్రాజెక్టులను 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మెట్రో రైలు విస్తరణ, స్టార్మ్ వాటర్ డ్రెయిన్ పనులను 2028 నాటికి, భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టులను 2027 నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు. 2029 నాటికి ప్రపంచ స్థాయి రహదారి సదుపాయాలను కల్పిస్తామని పేర్కొన్నారు.
భవిష్యత్ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని రూ.10,000 కోట్ల పెట్టుబడితో ‘గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఏఐ, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ వంటి రంగాలపై దృష్టి సారించే ఈ కేంద్రం ద్వారా సుమారు 20,000 అధిక వేతన ఉద్యోగాలు సృష్టించబడతాయని తెలిపారు.
ఇక పట్టణ సమస్యల పరిష్కారానికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. వీధి కుక్కల సమస్యను శాస్త్రీయంగా నియంత్రించేందుకు యానిమల్ బెర్త్ కంట్రోల్ కార్యక్రమాన్ని బలోపేతం చేస్తామని, వెటర్నరీ వైద్యులు, డాగ్ క్యాచర్ల సంఖ్యను మూడు రెట్లు పెంచుతామని వెల్లడించారు. అదనంగా, మెట్రో వాటర్ కనెక్షన్లు లేని ప్రాంతాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయడం, అన్ని నివాస ప్రాంతాల్లో హై-ఇంటెన్సిటీ వీధి దీపాలను ఏర్పాటు చేయడం వంటి హామీలు కూడా మేనిఫెస్టోలో చోటు చేసుకున్నాయి.
ఈ మేనిఫెస్టో చెన్నై నగర సమగ్రాభివృద్ధికి దోహదపడుతుందనే ఆశాభావాన్ని డీఎంకే నాయకత్వం వ్యక్తం చేసింది.








