కొమరం భీం ఆసిఫాబాద్ : తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. శుక్రవారం ప్రాజెక్టు ప్రాంతంలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
సమావేశంలో ప్రాజెక్టుకు సంబంధించిన పూర్వాపరాలు, ప్రస్తుత పరిస్థితి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆయకట్టుకు కలిగే ప్రయోజనాలపై మంత్రి అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రాజెక్టు మ్యాపులు, ఆయకట్టు విస్తీర్ణం, ప్రాజెక్టు సామర్థ్యం, ఎత్తు తదితర అంశాలను అధికారులు మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భూములకు సాగునీరు అందించేందుకు ఉన్న అవకాశాలను సమగ్రంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు డిజైన్, నీటి లభ్యత, సాంకేతిక అంశాలపై ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రేపటి క్షేత్రస్థాయి పర్యటనలో ప్రాజెక్టు పనుల పురోగతిని స్వయంగా పరిశీలించనున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లా రైతాంగానికి మేలు చేకూరేలా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్, నీటిపారుదల శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.








