పార్వతీపురం/కురుపాం : సీజనల్ వ్యాధులు, ముఖ్యంగా మలేరియా నివారణకు జిల్లా వ్యాప్తంగా లార్వా వేట కార్యక్రమాన్ని చేపట్టినట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర్ రెడ్డి తెలిపారు. జియ్యమ్మవలస మండలం గోర్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మలేరియా కేసులు అధికంగా నమోదయ్యేవని తెలిపారు. అయితే “మా ఊరికి మలేరియా వద్దు”, “ఫ్రైడే–డ్రై డే” వంటి కార్యక్రమాల ద్వారా చేపట్టిన చర్యల ఫలితంగా గత ఆరు నెలలుగా కేసులు గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు. ప్రస్తుతం నమోదవుతున్న స్వల్ప కేసులను కూడా పూర్తిగా అరికట్టేందుకు లార్వా వేట కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు.
మంచినీటిలో పెరిగే దోమల లార్వాలను గుర్తించి నిర్మూలించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. కొబ్బరి బోండాలు, పాత టైర్లు, రోళ్లు, చెట్టు తొర్రలు, ఇంటి పరిసరాల్లో నీరు నిలిచే ప్రదేశాల్లో దోమలు గుడ్లు పెడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, ఇప్పటికే ఎంపీడీఓలకు ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చామని తెలిపారు. వారు గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తారని చెప్పారు.
స్నానం చేసిన తర్వాత చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తప్పనిసరిగా ఒంటికి నూనె రాసుకోవాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లోని మహిళలు, ప్రజలు రాత్రి వేళల్లో దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చేతులు పూర్తిగా కప్పుకునేలా ఫుల్ హ్యాండ్స్ దుస్తులు ధరించాలని సూచించారు. ప్రతి గ్రామంలోని వాగుల వద్ద లార్వా గుర్తింపు ప్రక్రియను ముమ్మరం చేసి, లార్వా నివారణకు ఆయిల్ బాల్స్ వేయాలని అధికారులను ఆదేశించారు.
అలాగే దోమల నివారణకు “వాగు వెంబడి – వాగు పండగ” అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వాగులను గుర్తించి, అక్కడ పేరుకుపోయిన దోమల లార్వాను నిర్మూలించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది వాగుల వద్దకు వెళ్లి లార్వా ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయడం ద్వారా దోమల పెరుగుదలను అరికట్టాలని అధికారులు సూచించారు.








