ఎల్‌పీజీ లోడ్‌తో ప్రయాణిస్తున్న ‘సైమీ’ ట్యాంకర్ సురక్షితంగా Kandla Portకు చేరుకుంది. మార్షల్ ఐలాండ్స్ జెండాతో నడుస్తున్న ఈ నౌక దాదాపు 20 వేల టన్నుల ఎల్‌పీజీ ఇంధనాన్ని భారత్‌కు తీసుకొచ్చింది. పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితుల మధ్య మే 13న హర్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటి భారత తీరానికి చేరుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ నౌకలో మొత్తం 21 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో ఎనిమిది మంది ఉక్రెయిన్ పౌరులు కాగా, 13 మంది ఫిలిప్పీన్స్‌కు చెందినవారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో హర్మూజ్ జలసంధిని దాటిన 11వ ఎల్‌పీజీ ట్యాంకర్‌గా ‘సైమీ’ నిలిచింది.
షిప్పింగ్, విదేశాంగ, రక్షణ, చమురు శాఖల సమన్వయంతో ఈ ట్యాంకర్ సురక్షితంగా భారత్‌కు చేరినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిలో గత 75 రోజులుగా ఏర్పడుతున్న అంతరాయాలు భారత్ ముడిచమురు దిగుమతులపై ప్రభావం చూపుతున్నాయి.
ఇంధన విశ్లేషణ సంస్థ Kpler వెల్లడించిన వివరాల ప్రకారం, గత కొన్ని నెలల్లో భారత చమురు నిల్వలు దాదాపు 15 శాతం మేర తగ్గాయి. ఫిబ్రవరి చివర్లో 107 మిలియన్ బారెల్స్‌గా ఉన్న నిల్వలు ప్రస్తుతం 91 మిలియన్ బారెల్స్‌కు పడిపోయాయి.
దిగుమతుల్లో అంతరాయాలు ఉన్నప్పటికీ భారతీయ రిఫైనరీలు ప్రస్తుతం తమ కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తున్నాయి. ప్రాసెసింగ్ పనుల్లో ఇప్పటివరకు ఎలాంటి కోతలు విధించలేదు. అయితే సరఫరా సమస్యలు మరింత కాలం కొనసాగితే రిఫైనరీలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితులు మారకపోతే భవిష్యత్తులో ముడిచమురు ప్రాసెసింగ్ స్థాయిలను తగ్గించాల్సిన పరిస్థితి రావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.








