పార్వతీపురం మన్యం జిల్లా: గరుగుబిల్లి మండల పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులు కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వామివారి దర్శనార్థం రోజూ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండగా, వారికి ప్రత్యేక బస్టాప్ గానీ, వేచి ఉండేందుకు విశ్రాంతి భవనం గానీ లేకపోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి శనివారం వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివస్తుండగా, అక్కడ సరైన నీడ సౌకర్యం లేక చిన్నపిల్లలు, వృద్ధులు ఎండలోనే చెట్ల కింద వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఎండ తీవ్రతను తట్టుకోలేక భక్తులు చెట్ల నీడనే ఆశ్రయిస్తున్నామని తెలిపారు.
ఈ నేపథ్యంలో కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రత్యేక చొరవ తీసుకుని ఆలయ ప్రాంగణంలో విశ్రాంతి భవనం, బస్టాప్ మంజూరు చేయాలని భక్తులు కోరుతున్నారు. రోజురోజుకూ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, అందుకు తగిన మౌలిక వసతుల కల్పనలో అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆధ్యాత్మిక కేంద్రాలకు బస్టాప్, విశ్రాంతి గది వంటి సౌకర్యాలు విలాసాలు కాదని, అవి భక్తులకు అవసరమైన కనీస వసతులేనని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, స్థానిక నాయకులు స్పందించి యుద్ధప్రాతిపదికన విశ్రాంతి భవనం నిర్మాణం చేపట్టాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.








