జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ కొనసాగుతున్నాయి. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD) పిలుపు మేరకు జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్ పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ మెడికల్ షాపులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి.
ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలు పెరగడం, భారీ డిస్కౌంట్లతో వ్యాపారాన్ని దెబ్బతీయడం, కాలం చెల్లిన మందుల అమ్మకాలు, సరైన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు విక్రయించడం వంటి అంశాలను వ్యతిరేకిస్తూ ఈ బంద్ చేపట్టినట్లు మెడికల్ షాపుల నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా మల్టీనేషనల్ కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా మందులను విక్రయించడం వల్ల చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆన్‌లైన్ మందుల విక్రయాల వల్ల స్థానిక మెడికల్ షాపుల వ్యాపారం దెబ్బతింటోందని, దీని ప్రభావం ఉద్యోగులపై కూడా పడుతోందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అందుబాటులో ఉండటం వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
బంద్ విషయాన్ని ముందుగానే ప్రకటించడంతో ప్రజలు అవసరమైన మందులను ముందుగానే కొనుగోలు చేసుకోవాలని మెడికల్ అసోసియేషన్ సూచించింది. అయితే అత్యవసర మందుల సరఫరాకు ఎలాంటి అంతరాయం ఉండదని నిర్వాహకులు స్పష్టం చేశారు.
జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులు మూతపడటంతో పలు ప్రాంతాల్లో సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఆన్‌లైన్ మందుల విక్రయాలపై కఠిన నియంత్రణలు తీసుకురావాలని నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు.








