చేగుంట–తూప్రాన్ : రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మే 20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని చేగుంట మండల వివోఏల సంఘం సభ్యులు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఎస్సై చైతన్య కుమార్ రెడ్డిని కలిసి సమ్మె నోటీసును అందజేశారు.
ఈ సందర్భంగా వివోఏల సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న వివోఏలకు కనీస వేతనం రూ.20 వేల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆరోగ్య హెల్త్ పాలసీ, పదోన్నతులు, ఆరోగ్య బీమా, ట్యాబ్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
తమ డిమాండ్లు న్యాయమైనవేనని, ప్రభుత్వం స్పందించి వెంటనే పరిష్కారం చూపాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె నుంచి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. తమ ఆందోళనకు పోలీసు శాఖ సహకారం అందించాలని ఎస్సైని కోరినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అవుబోతు స్వామి, భానుప్రియ, కవిత, హారిక, అరుణ, పద్మ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.








