కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ జక్కనపెల్లి శ్రీలతపై గ్రామస్తులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఉపాధి హామీ కూలీలను తన వ్యక్తిగత వ్యవసాయ పనులకు వినియోగిస్తూ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ ఈ నెల 11వ తేదీన కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
గ్రామస్తుల ఫిర్యాదుపై స్పందించిన అధికార యంత్రాంగం గురువారం ఖాసీంపేట గ్రామంలో విచారణ చేపట్టింది. మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) ఏ. శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ విచారణలో గ్రామస్తులు, ఉపాధి హామీ కూలీల వాంగ్మూలాలు నమోదు చేశారు.
ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ, విచారణకు సంబంధించిన పూర్తి నివేదికను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్‌డీఓ)కు పంపించనున్నట్లు తెలిపారు. విచారణలో గ్రామ సర్పంచ్ కర్నే చంద్రయ్య, ఉపసర్పంచ్ సంధవేణి ఐలయ్య, ఏపీఓ, ఈసీ, టీఏ, పంచాయతీ కార్యదర్శి, ఉపాధి హామీ కూలీలు మరియు ఫిర్యాదుదారులు పాల్గొన్నారు.








