అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని గుత్తి పట్టణంలో మహిళలు, చిన్నారుల భద్రతపై సమగ్ర అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS ఆదేశాల మేరకు గుత్తి పట్టణం నిజాం షాదీఖానాలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా సంరక్షణ చట్టాలు, స్త్రీరక్ష పోర్టల్, శక్తి టీమ్ సేవలు మరియు అత్యవసర హెల్ప్‌లైన్‌ల వినియోగంపై విస్తృతంగా చైతన్యం కల్పించారు.
మహిళలపై జరుగుతున్న వివిధ రకాల నేరాలు, ముఖ్యంగా గృహహింస, వేధింపులు, సైబర్ మోసాలు, బాల్య వివాహాలు వంటి అంశాలపై పోలీసు అధికారులు వివరంగా అవగాహన కల్పించారు. మహిళలు ఎదుర్కొనే సమస్యలను వెంటనే గుర్తించి, చట్టపరమైన రక్షణ పొందే విధానాలను వివరించారు.
అలాగే క్షేత్రస్థాయిలో మహిళల సమస్యల పరిష్కారం కోసం అమలు చేస్తున్న స్త్రీరక్ష పోర్టల్ సేవలు, శక్తి యాప్ & టీమ్ సేవలు, మహిళల కోసం అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్ నంబర్లు మరియు పోలీస్ స్టేషన్‌లో అందించే సేవల గురించి తెలియజేశారు. స్త్రీరక్ష పోర్టల్ ద్వారా ఇంటి నుంచే సమస్యలను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
మహిళలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని, చట్టం వారికి పూర్తి రక్షణ కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. కుటుంబ మరియు సామాజిక స్థాయిలో మహిళల భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సూచించారు.
జిల్లా పోలీస్ శాఖ మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అత్యవసర పరిస్థితుల్లో సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100/112 కు సమాచారం అందించాలని, తక్షణ సహాయం అందించేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గుత్తి సీఐ రామారావు, అనంతపురం మహిళా విభాగం సీఐ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా, మెప్మా సిబ్బంది, పోలీస్ సిబ్బంది, మహిళలు మరియు GMSK సభ్యులు పాల్గొన్నారు.








