contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

600 వడ్ల బస్తాల ‘దిగ్బంధం’: హమాలీల మొండితనం..

● గన్నేరువరం చౌరస్తాలో లారీ ప్రమాదం: 22 గంటలు గడిచినా కదలని వాహనం.. నిలిచిన రవాణా, రోడ్డుపైనే బాధితులు!

● సర్పంచ్, డిప్యూటీ తాసిల్దార్ చొరవతో బయటకు తీసిన లారీ

 

కరీంనగర్ జిల్లా: అతివేగం, అజాగ్రత్త ఒకరి ఇంటిని ఊబిలోకి నెడితే.. హమాలీల మొండితనం, అధికారుల నిర్లక్ష్యం ఆ కుటుంబాన్ని 22 గంటలుగా నడిరోడ్డుపై ఎండలో మాడ్చుతోంది. గన్నేరువరం మండల కేంద్రంలో జరిగిన లారీ ప్రమాదం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తోంది.

● అర్ధరాత్రి మృత్యుఘోష.. తప్పిన పెను ప్రమాదం!

గురువారం అర్ధరాత్రి 11 గంటల ప్రాంతంలో ఐకేపీ కేంద్రం నుండి 600 వరి ధాన్యం బస్తాల లోడుతో కరీంనగర్ వెళ్తున్న లారీ.. గన్నేరువరం పనగడి చౌరస్తా వద్దకు రాగానే అదుపు తప్పింది. మూలమలుపు వద్ద డ్రైనేజీలోకి దూసుకెళ్లి, స్థానిక నివాసి బుర్ర శ్రీనివాస్ ఇంటిపైకి ఒరిగిపోయింది. అర్ధరాత్రి వేళ వచ్చిన భారీ శబ్దానికి కాలనీవాసులు ఉలిక్కిపడ్డారు. అదృష్టవశాత్తూ లారీ పూర్తిగా ఇల్లుపై పడకపోవడంతో ఇంట్లో నిద్రిస్తున్న వారు ప్రాణాలతో బయటపడ్డారు.

● రూ. 16,000 ఇస్తేనే కదులుతాం: హమాలీల డిమాండ్!

ప్రమాదం జరిగి 22 గంటలు గడుస్తున్నా పరిస్థితి ఇంచు కూడా మారలేదు. లారీని బయటకు తీయాలంటే అందులోని 600 వడ్ల బస్తాలను అన్‌లోడ్ చేయాల్సి ఉంది. అయితే, సహాయక చర్యలకు సహకరించాల్సిన హమాలీలు ఇక్కడ రూ. 16,000 ఇస్తేనే బస్తాలు దించుతాం, లేదంటే లేదు అంటూ మొండికేసారు.

మేము తీయకుంటే నీకు ఎవ్వరూ తీయరు.. ఇక్కడి నుండి లారీ కదిలేదే లేదు” అంటూ హమాలీలు డ్రైవర్‌ను బెదిరింపు ధోరణిలో డిమాండ్ చేయడంతో పోలీసులు, అధికారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. అంత భారీ సొమ్ము ఇచ్చుకోలేక, ఏం చేయాలో పారిపోలేఖ లారీ డ్రైవర్ తీవ్ర అయోమయంలో మునిగిపోయాడు.

● మండే ఎండలో బాధితులు.. స్తంభించిన రవాణా!

ఈ వివాదం కారణంగా ఇల్లు ఏ క్షణంలో కూలిపోతుందోనన్న భయంతో బాధితులు నిన్నటి నుండి ఇల్లు వదిలి, ఈ మండే ఎండలో ఆరుబయటే తలదాచుకుంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం, హమాలీల పట్టుదలపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు గన్నేరువరం టు కరీంనగర్ ప్రధాన రహదారి పూర్తిగా స్తంభించిపోవడంతో ఆర్టీసీ బస్సులు,ఉద్యోగులు నరకం చూస్తున్నారు. హమాలీల మొండి వైఖరి ఇలాగే కొనసాగితే స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగే అవకాశం కనిపిస్తోంది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకముందే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని లారీని తొలగించాలని ప్రజలు డిమాండ్ చేశారు.

● రంగంలో దిగిన సర్పంచ్, డిప్యూటీ తాసిల్దారు

జరిగిన ఘటనపై సర్పంచికి , డిప్యూటీ తాసిల్దార్ కి గ్రామస్తులు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన గ్రామ సర్పంచ్ రంగనవేని లచ్చినర్సు, డిప్యూటీ తాసిల్దార్ ప్రణీత్ కుమార్ హమాలీలను రప్పించి లారీలో ఉన్న 600 ధాన్యం బస్తాలను వేరే లారీలోకి లోడింగ్ చేపించి. అదే లారీ తో ఇనుప వైర్ తో డ్రైనేజీలో ఇరుక్కుపోయిన లారీని బయటికి తీశారు. దీంతో అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇల్లుకు ఎలాంటి నష్టం జరగకపోవడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :