contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం: పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం

కరీంనగర్ : కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే ప్రధాన లక్ష్యంగా పోలీసు అధికారులు నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సూచించారు. కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల పనితీరు, డిజిటల్ రికార్డుల నిర్వహణ, క్షేత్రస్థాయి భద్రతా చర్యలపై శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షా సమావేశంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చి పనిచేస్తున్న కార్మికుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. కరీంనగర్ పరిధిలో సుమారు వెయ్యి మంది నేపాలీలు వివిధ రంగాల్లో పనిచేస్తున్నప్పటికీ, ప్రస్తుతం కేవలం 169 మంది వివరాలు మాత్రమే పోలీస్ రికార్డుల్లో నమోదయ్యాయని తెలిపారు. అందువల్ల ప్రతి వలస కార్మికుడి పూర్తి వివరాలు, గుర్తింపు కార్డుల సమాచారంతో సహా సంబంధిత పోలీస్ స్టేషన్లలో నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే యజమానులు తమ వద్ద పనిచేస్తున్న కార్మికుల వివరాలను పోలీసులకు అందించాలని సూచించారు.

సీసీటీఎన్ఎస్ (Crime and Criminal Tracking Network & Systems) పోర్టల్‌లో కేసుల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో కేసుల దర్యాప్తు, ట్రాకింగ్, రికార్డుల పరిశీలన పూర్తిగా ఈ వ్యవస్థపై ఆధారపడనున్న నేపథ్యంలో ప్రతి కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నిర్ణీత గడువులోగా నమోదు చేయాలని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు.

రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలపై స్థానిక పోలీసులు నిరంతర నిఘా కొనసాగించాలని ఆయన ఆదేశించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే అసాంఘిక శక్తుల కార్యకలాపాలను ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలో ప్రశాంత వాతావరణం కొనసాగేందుకు ప్రతి పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు.

పోలీస్ స్టేషన్లలోని మాల్ఖానాల నిర్వహణ పారదర్శకంగా, క్రమబద్ధంగా ఉండాలని కమిషనర్ పేర్కొన్నారు. కేసులకు సంబంధించిన స్వాధీన వస్తువుల వివరాలను రికార్డుల్లో స్పష్టంగా నమోదు చేయడంతో పాటు వాటి భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో ఏసీపీ సీసీఆర్‌బీ శ్రీనివాస్ జి, ఇన్స్పెక్టర్ సరిలాల్, కమ్యూనికేషన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌తో పాటు కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :