అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియపై వస్తున్న అపోహలు, ఆరోపణలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చింది. డీఎస్సీ పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల ప్రకటన వరకు ప్రతి దశ అత్యంత పారదర్శకంగా, కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలతో నిర్వహించామని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు.
శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆయన డీఎస్సీ ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలను వివరించారు. దేశంలో అత్యంత విశ్వసనీయమైన టీసీఎస్ ఐయాన్ ప్లాట్‌ఫామ్ ద్వారా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఇదే ప్లాట్‌ఫామ్‌ను ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్, ఎన్టీఏ, ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు, పలు రాష్ట్రాల హైకోర్టులు కూడా వినియోగిస్తున్నాయని గుర్తు చేశారు.
పరీక్షల సమయంలో ప్రశ్నపత్రాలు 256-బిట్ ఎన్క్రిప్షన్ విధానంలో కేంద్రాలకు చేరుతాయని, ప్రతి అభ్యర్థికి ప్రశ్నల క్రమం జంబుల్డ్ పద్ధతిలో వేర్వేరుగా ఉంటుందని వివరించారు. దీంతో మానవ ప్రమేయం లేదా అక్రమాలకు ఎలాంటి అవకాశం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యవస్థపై ఇప్పటివరకు ఎలాంటి అవకతవకల ఫిర్యాదులు నమోదు కాలేదని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలతో పాటు హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో మొత్తం 154 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి కేంద్రాన్ని ప్రభుత్వ, టీసీఎస్ బృందాలు ముందుగానే తనిఖీ చేసి, అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రతా ప్రమాణాలు ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాతే ఎంపిక చేశామని చెప్పారు.
మార్చి 6 నుంచి ఏప్రిల్ 2 వరకు 24 రోజుల పాటు 89 సెషన్లలో పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు ప్రభుత్వ, టీసీఎస్ ఇన్విజిలేటర్ల ద్వారా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగలేదని, అలాంటి సమాచారం కూడా తమ దృష్టికి రాలేదని స్పష్టం చేశారు.
ఫలితాల ప్రకటనలోనూ పూర్తి పారదర్శకత పాటించామని కోన శశిధర్ పేర్కొన్నారు. మే 5న ప్రాథమిక కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించామని, వాటిని పరిశీలించి జూన్ 1న తుది కీ విడుదల చేసినట్లు తెలిపారు. అనంతరం నార్మలైజేషన్ విధానంలో స్కోర్లను లెక్కించి జూన్ 11న డీఎస్సీ స్కోర్లు, జూన్ 22న టెట్-డీఎస్సీ కలిపిన స్కోర్లను జిల్లా వారీగా వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని చెప్పారు.
ఫలితాల జాబితాలను వెబ్సైట్ నుంచి తొలగించారనే ప్రచారంలో వాస్తవం లేదని, అవి ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. కొందరు అభ్యర్థులకు మాత్రమే సమాచారం పంపారనే వార్తలను కూడా ఆయన ఖండించారు.
దరఖాస్తుల ప్రక్రియ గురించి వివరిస్తూ, మొదట అన్ని సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని నిబంధన పెట్టినప్పటికీ, అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో సమర్పించే అవకాశం కల్పించామని తెలిపారు. అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం ప్రతి జిల్లాలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి సహాయం అందించినట్లు వెల్లడించారు.
మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చేపట్టిన డీఎస్సీ నియామక ప్రక్రియను ప్రతి దశలోనూ నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా నిర్వహించామని కోన శశిధర్ పునరుద్ఘాటించారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.








