న్యూఢిల్లీ: భారత సైన్యానికి కొత్త చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా Lieutenant General Dhiraj Seth ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా సేవలందిస్తున్న ఆయన, జూన్ 30న దేశ తదుపరి ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. అదే రోజు ప్రస్తుత ఆర్మీ చీఫ్ General Upendra Dwivedi పదవీ విరమణ చేయనున్నారు.
దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సైనిక అనుభవం కలిగిన ధీరజ్ సేథ్, భారత సైన్యంలో వివిధ కీలక హోదాల్లో సేవలందించారు. National Defence Academy లో శిక్షణ పొందిన ఆయన 1986 డిసెంబర్లో ఆర్మర్డ్ కార్ప్స్లో అధికారిగా సైన్యంలో చేరారు. అప్పటి నుంచి దేశ రక్షణ వ్యవస్థలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ తన ప్రతిభను చాటుకున్నారు.
ఎడారి ప్రాంతాల్లో ఆర్మర్డ్ రెజిమెంట్‌కు నాయకత్వం వహించిన సేథ్, పశ్చిమ సరిహద్దుల్లో ఆర్మ్డ్ బ్రిగేడ్ కమాండర్‌గా కూడా పనిచేశారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను పర్యవేక్షించే దళాలకు నాయకత్వం వహించి విశేష సేవలు అందించారు. అనంతరం లెఫ్టినెంట్ జనరల్ హోదాలో భారత సైన్యంలో అత్యంత కీలకమైన స్ట్రైక్ ఫార్మేషన్లలో ఒకటైన ‘సుదర్శన్ చక్ర కార్ప్స్’ కమాండర్‌గా వ్యవహరించారు.
అలాగే ఢిల్లీ ప్రాంత జనరల్ ఆఫీసర్ ఇన్ కమాండింగ్‌గా పనిచేసిన సమయంలో దేశీయ, అంతర్జాతీయ సైనిక కార్యక్రమాల సమన్వయ బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు. సైన్యాన్ని ఆధునిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం, భవిష్యత్ యుద్ధ వ్యూహాల రూపకల్పన, సైనిక సామర్థ్యాల పెంపు, దళాల పునర్వ్యవస్థీకరణ వంటి అంశాల్లో ఆయన కీలక పాత్ర పోషించినట్లు రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి.
ధీరజ్ సేథ్ హయ్యర్ కమాండ్ కోర్స్‌తో పాటు National Defence College లో ఉన్నత శిక్షణ పొందారు. అంతేకాకుండా Paris లో నిర్వహించే ప్రతిష్ఠాత్మక కమాండ్ అండ్ స్టాఫ్ కోర్స్‌లో కూడా పాల్గొన్నారు. సమకాలీన సైనిక వ్యూహాలు, ఆధునిక యుద్ధ సాంకేతికతలపై ఆయనకు విస్తృత అవగాహన ఉందని అధికారులు చెబుతున్నారు.
భారత సైన్యాన్ని మరింత ఆధునికీకరించడం, సరిహద్దు భద్రతను బలోపేతం చేయడం, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా దళాలను సిద్ధం చేయడం వంటి అంశాల్లో ధీరజ్ సేథ్ నాయకత్వం కీలకంగా మారనుందని రక్షణ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.








