contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

జమ్మికుంట మండలంలో టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి

కరీంనగర్ జిల్లా (జమ్మికుంట): కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా, నిల్వలను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిఘాను మరింత ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సోమవారం జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ వాసాల సతీష్ ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా నిల్వ ఉంచిన మూడు భారీ ఇసుక డంప్‌లను పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా విలాసాగర్ పరిసర ప్రాంతాల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఒక పెద్ద ఇసుక డంప్‌లో సుమారు 100 ట్రాక్టర్ల లోడ్ల ఇసుకను గుర్తించగా, మిగిలిన రెండు డంప్‌లలో మరో 50 ట్రాక్టర్ల లోడ్ల ఇసుక నిల్వలు ఉన్నట్లు తేలింది. మొత్తంగా దాదాపు 150 ట్రాక్టర్ల లోడ్ల అక్రమ ఇసుకతో పాటు రవాణాకు ఉపయోగిస్తున్న రెండు ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేశారు.

స్వాధీనం చేసుకున్న ఇసుక నిల్వలు, వాహనాలను తదుపరి చట్టపరమైన చర్యలు, సమగ్ర విచారణ నిమిత్తం జమ్మికుంట పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు ఏసీపీ వాసాల సతీష్ తెలిపారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం హెచ్చరిస్తూ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా సహజ వనరులైన ఇసుకను తవ్వడం, నిల్వ ఉంచడం లేదా రవాణా చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అక్రమ ఇసుక రవాణాపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మైనింగ్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

అక్రమ ఇసుక దందాపై టాస్క్‌ఫోర్స్ చేపట్టిన ఈ చర్యలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :