మంగళగిరి: మంగళగిరి నియోజకవర్గ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న భూగర్భ డ్రైనేజీ (యూజీడీ) వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంటీఎంసీ) పరిధిలో సుమారు రూ.1,167.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న భారీ యూజీడీ ప్రాజెక్టుకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం శంకుస్థాపన చేశారు.
తాడేపల్లిలోని ప్రాతూరు రోడ్డులో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి మంత్రి లోకేశ్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు మంత్రులకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మంగళగిరి ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. యూజీడీ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ల తయారీ, నిధుల కేటాయింపు, పరిపాలన అనుమతుల ప్రక్రియను వేగంగా పూర్తి చేసి పనులను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు.
రెండు దశల్లో భారీ ప్రాజెక్టు
హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో అమలు చేయనున్న ఈ ప్రాజెక్టును రెండు దశలుగా చేపట్టనున్నారు. మొత్తం రూ.1,167.50 కోట్ల వ్యయంలో తొలి దశకు రూ.604.32 కోట్లు, రెండో దశకు రూ.563.18 కోట్లు కేటాయించారు. రాజధాని గ్రామాలైన బేతపూడి, నవులూరు, యర్రబాలెం, నిడమర్రు, పెనుమాక, ఉండవల్లి మినహా ఎంటీఎంసీ పరిధిలోని మిగతా ప్రాంతాలన్నీ ఈ ప్రాజెక్టు కిందకు రానున్నాయి.
531 కిలోమీటర్ల పైప్‌లైన్ నెట్వర్క్
ప్రాజెక్టు పరిధిలో మొత్తం 531 కిలోమీటర్ల పొడవైన భూగర్భ పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను నిర్మించనున్నారు. ఇందులో మొదటి దశలో 300 కిలోమీటర్లు, రెండో దశలో 231 కిలోమీటర్ల మేర పైప్లైన్లు ఏర్పాటు చేయనున్నారు. మురుగునీటి శుద్ధి కోసం మొత్తం 20 మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు) నిర్మించబడనున్నాయి. వీటి మొత్తం సామర్థ్యం రోజుకు 47.51 మిలియన్ లీటర్లుగా (ఎంఎల్డీ) ఉంటుంది.
ఆధునిక ఎస్బీఆర్ సాంకేతికతతో 14 ఎస్టీపీలు, ఎఫ్బీ టెక్ ప్యాకేజ్డ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల రూపంలో మరో 6 శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అదనంగా మురుగునీటి నిర్వహణ కోసం 18 లిఫ్ట్ స్టేషన్లను కూడా నిర్మించనున్నారు.
ప్రజారోగ్యానికి భరోసా
ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మంగళగిరి-తాడేపల్లి ప్రాంతాల్లో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడటంతో పాటు ప్రజారోగ్య ప్రమాణాలు కూడా గణనీయంగా పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రాంతీయ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలక మైలురాయిగా నిలవనుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలీ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు గుత్తికొండ ధనుంజయ్, గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








