తూప్రాన్ డివిజన్ : బాల కార్మికుల నిర్మూలన లక్ష్యంగా తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీల్లో ధాబాలు, హోటళ్లు, చికెన్ సెంటర్లు, కిరాణా దుకాణాలు మరియు ఇతర వ్యాపార సంస్థలను పరిశీలించారు.
తనిఖీల సందర్భంగా యజమానులకు బాల కార్మికులను పనిలో నియమించరాదని పోలీసులు స్పష్టంగా సూచించారు. బాల కార్మికుల (నిషేధం మరియు నియంత్రణ) చట్టం ప్రకారం చిన్నారులను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని అవగాహన కల్పించారు.
బాలల విద్య, భవిష్యత్తు పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న అధికారులు, వ్యాపార సంస్థల యజమానులు చట్ట నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎక్కడైనా బాల కార్మికులు పనిచేస్తున్నట్లు గుర్తిస్తే సంబంధిత యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రజలు సహకరించాలని, చిన్నారులను పనుల్లో కాకుండా విద్యాభ్యాసం వైపు ప్రోత్సహించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.








