అల్లూరి జిల్లా : అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మూలపేట పంచాయతీ పరిధిలోని జాజులబంధం పీవీటీజీ (ప్రత్యేకంగా బలహీన గిరిజన తెగ) కొందు ఆదివాసీ గ్రామంలో విద్యా పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గ్రామంలోని 34 మంది విద్యార్థుల కోసం గత ఏడాది ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ, ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, పాఠశాల ప్రారంభ సమయంలో జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు గ్రామాన్ని సందర్శించి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని నియమించినట్లు ప్రకటించారు. అయితే గత విద్యా సంవత్సరంలో ఆమె కేవలం రెండుసార్లు మాత్రమే పాఠశాలకు వచ్చారని, మిగతా రోజుల్లో వాలంటీర్ సహాయంతో పాఠశాల నిర్వహించారని ఆరోపించారు.
ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమై వారం రోజులు గడిచినా ఇప్పటివరకు ఉపాధ్యాయురాలు పాఠశాలకు హాజరుకాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రం నుంచి పాఠశాలలో చేరేందుకు సిద్ధంగా ఉన్న మరో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నప్పటికీ, టీచర్ లేకపోవడంతో వారి ప్రవేశాలు కూడా నిలిచిపోయాయని తెలిపారు.
గతంలో మాతృభూమి సంస్థ సహకారంతో రూ.70 వేల వ్యయంతో పాఠశాల షెడ్ నిర్మించారని, బ్లాక్‌బోర్డు వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. అయినప్పటికీ ఉపాధ్యాయులు లేకపోవడంతో పిల్లలు చదువుకు దూరమై పశువులు మేపేందుకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు కొండతామలి వెంకట్రావు, కొండుతాంలే జగ్గారావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి పాఠశాలకు శాశ్వత ఉపాధ్యాయుడిని నియమించాలని కోరారు. అలాగే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేయడంతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న తరుణంలో, జాజులబంధం గ్రామంలోని చిన్నారులకు కూడా నాణ్యమైన విద్య అందేలా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.








