contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పేపర్ మిల్ కార్మిక సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించాలి : మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్ మిల్ కార్మిక సంఘ ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప డిమాండ్ చేశారు. స్థానిక నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్మికులు తమ హక్కుల సాధన కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

సిర్పూర్ పేపర్ మిల్ ఈ ప్రాంతానికి ప్రధాన ఆర్థిక జీవనాధారమని, వేలాది కుటుంబాల ఉపాధి దీనిపైనే ఆధారపడి ఉందని కోనప్ప పేర్కొన్నారు. కార్మికుల సమస్యల పట్ల యాజమాన్యం, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమని అన్నారు. నెలల తరబడి కార్మిక సంఘ ఎన్నికలు జరగకపోవడంతో కార్మికుల సమస్యలు పరిష్కారం కాకుండా పేరుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కార్మిక సంఘానికే కార్మికుల తరఫున వేతన సవరణ ఒప్పందాలు చేసుకునే హక్కు ఉంటుందని, యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదని హెచ్చరించారు. కార్మిక సంఘ ఎన్నికల నిర్వహణ కోసం ఈ నెల 24న బీఆర్ఎస్ ప్రతినిధి బృందంతో కలిసి లేబర్ కమిషనర్‌ను కలవనున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఇచ్చిన హామీలను కోనేరు కోనప్ప ప్రశ్నించారు. కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని, స్థానిక యువతకు నాలుగు వేల ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ఎన్నికలకు ముందు కార్మికుల సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే, ప్రస్తుతం కార్మికులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ పట్టించుకోకపోవడం ఆయన చిత్తశుద్ధిపై అనుమానాలు కలిగిస్తోందని విమర్శించారు.

ప్రస్తుత ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, కార్మిక శాఖ మరియు మిల్ యాజమాన్యంతో చర్చించి ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోనప్ప సవాల్ విసిరారు. కార్మికులకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, కార్మికుల సంక్షేమం కోసం చివరి వరకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్మిక ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :