మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని వెల్దుర్తి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళికామాత దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. అనంతరం దేవాలయ ఆవరణలో నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా వివిధ మండలాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ తమ జన్మ నక్షత్రాలకు అనుగుణంగా మొక్కలను నాటారు. ప్రకృతి పరిరక్షణతో పాటు ఆధ్యాత్మిక చింతనను పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తన జన్మ నక్షత్రానికి సంబంధించిన మొక్కను నాటి, వేద పండితుల ఆశీర్వాదాలు స్వీకరించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ రమేష్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, వెల్దుర్తి మాజీ సర్పంచ్ వెన్నవరం మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోదండ కృష్ణ గౌడ్, వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, జగ్గా అశోక్ గౌడ్, సర్పంచులు రంగారెడ్డి, రంగి కృష్ణ, సాయిలుతో పాటు పార్టీ కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








