contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మిస్సింగ్ కేసును ఛేదించిన చిలకలూరిపేట పోలీసులు

చిలకలూరిపేట: ప్రేమించిన యువతి తనకు దూరమవుతోందనే అనుమానం ఓ యువకుడిని కిరాతకుడిగా మార్చింది. తనను కాదని మరో వ్యక్తికి దగ్గరవుతోందని అనుమానించిన అతడు.. పథకం ప్రకారం ప్రియురాలిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం సాక్ష్యాధారాలు మాయం చేసేందుకు మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు తెలిపారు. తొలుత మిస్సింగ్ కేసుగా నమోదైన ఈ ఘటనను పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఛేదించి హత్య వెనుక అసలు నిజాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. చిలకలూరిపేట పట్టణంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన షేక్ మస్తాన్ వలి కుమార్తె షేక్ హసీనా అలియాస్ యాస్మిన్ (23) బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం సూళ్లూరుపేటలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. కారంపూడి మండలం ఇనుపరాజుపల్లికి చెందిన జినుగు బాల సైదులు (25)తో ఆమెకు గత నాలుగేళ్లుగా ప్రేమ సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

అయితే కొంతకాలంగా హసీనా తనతో తక్కువగా మాట్లాడుతోందని సైదులు అనుమానించడం ప్రారంభించాడు. ఆమె తనను కావాలనే దూరం పెడుతోందని, మరో వ్యక్తికి దగ్గరవుతోందని భావించిన అతడు.. హసీనాను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఈ నెల 4న హసీనాకు ఫోన్ చేసిన సైదులు మాట్లాడుకుందామని నమ్మించి ఆమెను కారంపూడికి రప్పించినట్లు పోలీసులు తెలిపారు. అక్కడి నుంచి కారంపూడి–నకరికల్లు రోడ్డులోని ఎన్‌ఎస్‌పీ కాలువ పశ్చిమ కట్ట వద్ద ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి ఆమెను తీసుకెళ్లాడు.

ఎవరూ లేరని నిర్ధారించుకున్న అనంతరం ముందుగానే తన వెంట తెచ్చుకున్న కూరగాయల కత్తితో హసీనాపై దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆమె గొంతును గట్టిగా పట్టుకుని కడుపులో మూడుసార్లు కత్తితో పొడిచినట్లు తెలిపారు. తీవ్ర గాయాలతో హసీనా అక్కడికక్కడే మృతి చెందినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

హత్య అనంతరం సాక్ష్యాధారాలు మిగలకుండా చేయాలనే ఉద్దేశంతో సైదులు తన బైక్‌లోని పెట్రోల్‌ను ఖాళీ వాటర్ బాటిల్‌లోకి తీసుకుని మృతదేహంపై పోసి నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి పరారైనట్లు వెల్లడించారు.

కూతురు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన హసీనా తండ్రి మస్తాన్ వలి చిలకలూరిపేట టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తొలుత మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కోస్టల్ జోన్ ఐజీ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి, ఎస్పీ జె.వి. సంతోష్, నరసరావుపేట డీఎస్పీ ఎం. హనుమంతురావు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు గాలింపు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు కొనసాగించిన పోలీసులు.. అనుమానితుల కదలికలు, ఇతర ఆధారాలను విశ్లేషించి సైదులుపై దృష్టి సారించారు.

ఈ క్రమంలో ఆగస్టు 8న కారంపూడి పాత సినిమా హాలు సెంటర్‌లోని హోండా షోరూం వద్ద సైదులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో హత్యకు సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

దీంతో మహిళ అదృశ్యానికి సంబంధించిన కేసును హత్య కేసుగా మార్చారు. Cr.No.214/2026, సెక్షన్లు 103(1), 140(1), 238 BNS కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.

ఈ కేసును త్వరితగతిన ఛేదించడంలో చిలకలూరిపేట టౌన్ సీఐ పి. రమేష్, ఎస్‌ఐలు వి. సోమేశ్వరరావు, పి. హజరత్తయ్యతో పాటు పోలీసు సిబ్బంది కీలకంగా వ్యవహరించారని అధికారులు తెలిపారు.

ప్రేమలో అనుమానం పెరిగితే ఎంతటి విషాదానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. ఒక యువతి ప్రాణాలను బలిగొన్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :