అనంతగిరి: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెద్దకోట పంచాయతీ పరిధిలోని మడ్రేబు కొండశిఖర గ్రామంలో నివసిస్తున్న కొందు PVTG గిరిజన కుటుంబాల చిరకాల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. గ్రామంలో సుమారు 30 కుటుంబాలు నివసిస్తుండగా, రేషన్ బియ్యం కోసం వేలమామిడి గ్రామానికి సుమారు 15 కిలోమీటర్లు గుర్రాలపై వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
తమ గ్రామంలోనే రేషన్ పాయింట్ ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామస్థులు జూలై 9, 2026న గుర్రాలతో సుమారు మూడు కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. ఈ సమస్యపై రిపోర్టర్ టీవీ తో పాటు పలు పత్రికల్లో వార్తలు ప్రచురితం కావడంతో అధికార యంత్రాంగం స్పందించింది. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సమస్యను పరిశీలించి చర్యలు తీసుకోవడంతో మడ్రేబు గ్రామంలోనే రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభమైంది.
వేలమామిడి SHGకు చెందిన ఇమ్మానియేల్ గ్రూప్ ఆధ్వర్యంలో గ్రామానికి బియ్యం తీసుకువచ్చి కుటుంబాలకు పంపిణీ చేశారు. ఎన్నో ఏళ్లుగా రేషన్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బంది తొలగడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
బియ్యం గ్రామానికి చేరుకున్న సందర్భంగా గ్రామస్థులు బియ్యం బస్తులను గ్రామంలో ఉంచి వాటి చుట్టూ సంప్రదాయ దింసా నృత్యం చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ సమస్యపై అధికారులు స్పందించి గ్రామంలోనే రేషన్ అందుబాటులోకి తీసుకురావడంపై వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
రోడ్డు పనులు కూడా కొనసాగుతున్నాయి
మడ్రేబు గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించేందుకు కూడా చర్యలు కొనసాగుతున్నాయి. 2024 డిసెంబర్ 21న అనంతగిరి మండలం బల్లగరువు ప్రాంతానికి వచ్చి రహదారి పరిస్థితిని పరిశీలించిన అనంతరం, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో సుమారు రూ.12 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని గ్రామస్థులు తెలిపారు. ప్రస్తుతం రోడ్డు ఫార్మేషన్ పనులు పూర్తవుతూ, రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
రేషన్ బియ్యం కోసం 15 కిలోమీటర్లు గుర్రాలపై ప్రయాణించాల్సిన పరిస్థితి నుంచి గ్రామంలోనే బియ్యం అందుకునే స్థాయికి చేరుకోవడం తమకు ఎంతో సంతోషంగా ఉందని గ్రామస్థులు తెలిపారు. రహదారి పూర్తయితే విద్య, వైద్యం, రవాణా వంటి మౌలిక సదుపాయాలు కూడా మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కొండతాంపల్లి నర్సింగరావు, మహిళలు సిదేరి ముగ్గు, కొండతాంబలి లింబో, కొండతాంబలి జగన్నాథం, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే. గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. తమ గ్రామ సమస్యను గుర్తించి స్పందించిన జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర అధికార యంత్రాంగానికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.








