మెట్‌పల్లి : జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నార్త్ అమెరికన్ పద్మశాలి అసోసియేషన్ (NAPA) ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్స్ సహకారంతో జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
శిబిరంలో కార్డియాలజీ, ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, జనరల్ మెడిసిన్‌తో పాటు కీళ్ల సంబంధిత సమస్యలకు వైద్య సేవలు అందించారు. బీపీ, షుగర్ పరీక్షలతో పాటు ECG, 2D ఎకో వంటి ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. వైద్యుల సూచనల మేరకు అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా NAPA కో-ఫౌండర్ ప్రదీప్, కో-ఆర్డినేటర్ మచ్చ ప్రభాకర్, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ సాంబారి ప్రభాకర్ మాట్లాడుతూ.. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా NAPA ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే మెట్‌పల్లిలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
కార్డియాలజీ, ఆంకాలజీ, జనరల్ మెడిసిన్ విభాగాలకు చెందిన వైద్యులతో సుమారు 1,000 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత మందులు అందించినట్లు తెలిపారు.
ఎన్‌ఆర్‌ఐల సహకారంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ పట్టణాల్లో మరిన్ని ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని NAPA ప్రతినిధులు వెల్లడించారు. ప్రతి సంవత్సరం ప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
స్థానిక ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించిన నిర్వాహకులను పలువురు అభినందించారు.








