కరీంనగర్ : అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం (జూన్-26) సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ నిర్వహిస్తున్న యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ కార్యక్రమాలు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రెండవ రోజు పలు పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
విద్యార్థుల్లో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై చైతన్యం కల్పించే ఉద్దేశంతో వ్యాసరచన, పోస్టర్ మేకింగ్, క్విజ్, ప్రసంగ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మాదకద్రవ్యాల వల్ల కలిగే సామాజిక, ఆరోగ్యపరమైన సమస్యలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అధికారులు బహుమతులు అందజేసి ప్రోత్సహించారు. యువతను చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంచి క్రీడల వైపు మళ్లించేందుకు పలు ప్రాంతాల్లో క్రికెట్ మ్యాచ్లను కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు మాట్లాడుతూ, యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, మాదకద్రవ్యాల వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
యువతలో చైతన్యం పెంపొందించి, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.








