కరీంనగర్ : కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా, నిల్వలను అరికట్టేందుకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం ఉదయం కొత్తపల్లి మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల సందర్భంగా బావుపేట గ్రామ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన మూడు భారీ ఇసుక డంపులను టాస్క్ఫోర్స్ పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. ఈ మూడు డంపుల్లో మొత్తం 75 ట్రాక్టర్ లోడ్ల ఇసుక నిల్వ ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. స్వాధీనం చేసుకున్న ఇసుక నిల్వలను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కొత్తపల్లి పోలీస్ స్టేషన్కు అప్పగించారు.
అదేవిధంగా కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న ఒక ట్రాక్టర్ను పోలీసులు పట్టుకున్నారు. సీజ్ చేసిన ట్రాక్టర్ను తదుపరి చర్యల కోసం రూరల్ పోలీసులకు అప్పగించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అక్రమంగా తవ్వడం, నిల్వ చేయడం, రవాణా చేయడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. అక్రమ ఇసుక కార్యకలాపాలపై కమిషనరేట్ వ్యాప్తంగా నిరంతర నిఘా కొనసాగుతుందని తెలిపారు.
మైనింగ్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై మైనింగ్ చట్టాలు, ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అక్రమ ఇసుక రవాణా, నిల్వలకు పాల్పడే వ్యక్తులపై ప్రజలు కూడా సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.








