కరీంనగర్ జిల్లా: ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు తప్పనిసరిగా PSARA (ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ రెగ్యులేషన్ యాక్ట్-2005) నిబంధనల ప్రకారం లైసెన్స్ పొందిన తర్వాతే కార్యకలాపాలు నిర్వహించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం స్పష్టం చేశారు. చట్టబద్ధమైన అనుమతులు లేకుండా సెక్యూరిటీ సేవలు అందిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోలీస్ కమిషనరేట్ పరిధిలో లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏడు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. PSARA చట్టం ప్రకారం అనుమతి లేకుండా సెక్యూరిటీ ఏజెన్సీలను నిర్వహించడం నేరమని పేర్కొన్నారు.
గంగాధర, కొత్తపల్లి, కరీంనగర్-1 టౌన్, కరీంనగర్-2 టౌన్, చొప్పదండి పోలీస్ స్టేషన్ పరిధుల్లో పనిచేస్తున్న ఆయా ఏజెన్సీలపై PSARA Act-2005లోని సెక్షన్ 20, 22తో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 318(4) కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఏజెన్సీల ద్వారా సుమారు 146 మంది సెక్యూరిటీ గార్డులు విధులు నిర్వహిస్తున్నట్లు విచారణలో గుర్తించినట్లు వెల్లడించారు.
ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల యజమానులు సంబంధిత అనుమతులు, లైసెన్సులు పొందిన తర్వాతే కార్యకలాపాలు కొనసాగించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని గౌష్ ఆలం హెచ్చరించారు. జిల్లాలోని అన్ని ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు PSARA చట్టంలోని నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.








