అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపెల్లి పంచాయతీ పరిధిలోని గాదిలోవ గ్రామంలోనే పాఠశాలను తిరిగి ఏర్పాటు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్‌ను వేడుకున్నారు. చేతులు జోడించి తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
గ్రామస్తుల వివరాల ప్రకారం, గాదిలోవ గ్రామంలో గతంలో ప్రాథమిక పాఠశాల నిర్వహించబడేది. ప్రస్తుతం ఆ పాఠశాలలో గాదిలోవకు చెందిన 24 మంది, మూర్లోవ, పెద్దగుడ్ల గ్రామాలకు చెందిన మరో 20 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే కేవలం నలుగురు విద్యార్థుల కోసం గాదిలోవ పాఠశాలను చిన్నరాబా గ్రామ సరిహద్దుకు తరలించి అక్కడ నిర్వహిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
దీంతో మూర్లోవ, పెద్దగుడ్ల గ్రామాలకు చెందిన చిన్నారులు ప్రతిరోజూ సుమారు మూడు కిలోమీటర్లు నడిచి పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. మండుతున్న ఎండల్లో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొంతమంది విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు కూడా వెనుకాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో గాదిలోవ గ్రామంలో చెట్టు కిందైనా పాఠశాలను నిర్వహించేవారని గ్రామస్తులు గుర్తు చేశారు. అనంతరం పాఠశాలను చిన్నరాబాకు మార్చడంతో తమ సమస్యలను మండల విద్యాశాఖాధికారి (ఎంఈవో) దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఆ సమయంలో స్థానిక జడ్పీటీసీ డి. గంగరాజు, మండల విద్యాశాఖాధికారి గ్రామానికి వచ్చి గాదిలోవలో షెడ్ నిర్మించుకుంటే అక్కడే పాఠశాల నిర్వహించే అవకాశం ఉంటుందని సూచించినట్లు వెల్లడించారు.
దీంతో గ్రామస్తులంతా కలిసి శ్రమదానంతో ఒక షెడ్ నిర్మించుకున్నారని, అయితే కొంతమంది దుండగులు కావాలనే ఆ షెడ్డు తగులబెట్టారని ఆరోపించారు. అప్పటి నుంచి తమ పిల్లలు చదువుకు దూరమవుతున్నారని, విద్యాభ్యాసం తీవ్రంగా దెబ్బతింటోందని తల్లిదండ్రులు వాపోయారు.
తక్షణమే గాదిలోవ గ్రామంలోనే పాఠశాలను పునరుద్ధరించి విద్యార్థులకు అందుబాటులో విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌తో పాటు ప్రభుత్వాన్ని గ్రామస్తులు కోరారు. ఈ సందర్భంగా కొట్టపర్తి గంగమ్మ, కొట్టపర్తి సన్యాసి, కంసూరి గంగులు తదితర గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని తమ డిమాండ్‌ను వినిపించారు.








