contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తండ్రి పేరు.. భర్త పేరు.. మహిళల ధ్రువపత్రాలపై గందరగోళం

కాకినాడ: మహిళల విద్యార్హత పత్రాల్లో తండ్రి ఇంటి పేరు ఉన్నా, వివాహం తర్వాత భర్త ఇంటి పేరు ఆధార్‌లో నమోదు అయినా ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా ప్రభుత్వ ధ్రువపత్రాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని పౌర సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం ఆధార్ నంబర్‌ను ధ్రువపత్రాల ప్రక్రియతో అనుసంధానం చేయడం వల్ల సాంకేతిక సమస్యలు తలెత్తి మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు తెలిపారు.

వివాహం అనంతరం మహిళలు భర్త ఇంటి పేరుతో ఆధార్, రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు వంటి పత్రాలు పొందడం సహజమని ఆయన పేర్కొన్నారు. అయితే విద్యార్హత సర్టిఫికెట్లలో తండ్రి ఇంటి పేరు ఉండటంతో, ఆధార్‌లో కూడా అదే ఇంటి పేరు ఉండాలని, లేకుంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అప్‌లోడ్ కావడం లేదని సంబంధిత అధికారులు చెబుతున్నారని వివరించారు.

దీంతో ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే మహిళలు తప్పనిసరిగా ఆధార్‌లోని ఇంటి పేరును మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఇలా ఇంటి పేరు మార్పు చేయడం వల్ల భవిష్యత్తులో రేషన్ కార్డు, ఇతర కుటుంబ ధ్రువపత్రాలు, పాస్‌పోర్ట్ దరఖాస్తులు వంటి సందర్భాల్లో పలు చట్టపరమైన, సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా విదేశాల్లో ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం వెళ్లే వారి పిల్లలకు పాస్‌పోర్ట్ మంజూరు ప్రక్రియలో కుటుంబ సభ్యుల పత్రాల్లో ఇంటి పేరు భేదం ఉంటే ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

గతంలో ధ్రువపత్రాల కోసం కేవలం ఆధార్ నంబర్ నమోదు మాత్రమే చేసేవారని, ప్రస్తుతం ఆధార్‌ను నేరుగా అనుసంధానం చేయడం వల్ల ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని రమణరాజు తెలిపారు. మహిళల వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని, తండ్రి లేదా భర్త ఇంటి పేరు ఏదైనా ఉన్నా ధ్రువపత్రాల మంజూరులో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రత్యేక వెసులుబాట్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు తీసుకోకపోతే అనేక మంది మహిళలు ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తులు, పోటీ పరీక్షల అవకాశాలకు దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మహిళల మనోవేదనను అర్థం చేసుకుని సాంకేతిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :