కాకినాడ : రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా కాకినాడ నగర అభివృద్ధిలో ఆశించిన పురోగతి కనిపించడం లేదని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో నగర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తారు.
గత 742 రోజులుగా స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులు ముందుకు సాగకుండా విమర్శలు, ఆరోపణలకే పరిమితమయ్యాయని, ప్రజలు అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్నారని రమణరాజు పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, మురుగునీటి పారుదల వ్యవస్థ బలోపేతం, ఉప్పుటేరు ప్రక్షాళన వంటి కీలక ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తి స్థాయిలో పురోగతి సాధించలేదని తెలిపారు.
ఇంద్రపాలెం లాకులు, ప్రతాప్‌నగర్ బ్రిడ్జి, అన్నమ్మఘాటి సెంటర్, ఎంఎస్ఎం చారిటీస్ ప్రాంతాల్లో ప్రతిపాదించిన ఆధునిక ప్రవేశ ద్వారాల నిర్మాణం ఫైళ్లకే పరిమితమైందని ఆయన ఆరోపించారు. అమృత్ పథకం కింద నిర్మిస్తున్న మురుగునీటి శుద్ధి కేంద్రం కూడా ఇంకా అందుబాటులోకి రాలేదన్నారు.
కాకినాడ–జొన్నాడ ప్రధాన రహదారి అభివృద్ధి కోసం భూసేకరణ, యుటిలిటీ షిఫ్టింగ్‌కు అవసరమైన రూ.225 కోట్ల నిధులు విడుదల కాకపోవడంతో పాటు రూ.40 కోట్ల వ్యయంతో చేపట్టాల్సిన ఫ్లైఓవర్ నిర్మాణం నిలిచిపోయిందని ఆయన పేర్కొన్నారు. పీపీపీ విధానంలో చేపట్టిన బయో-మీథనేషన్, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు భూమి కేటాయింపుల ఆలస్యంతో నత్తనడకన సాగుతున్నాయని తెలిపారు.
పారిశ్రామిక కార్మికుల కోసం తక్కువ అద్దెతో 25 ఏళ్ల లీజు ప్రాతిపదికన నిర్మించాల్సిన గృహ సముదాయాల పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదని, ఆర్అండ్బీ, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన రోడ్లు, కాలువలు, కల్వర్టుల నిర్మాణం లేకపోవడంతో ప్యాచ్వర్క్లతోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. స్ట్రీట్ ఫుడ్ హబ్‌కు రూ.4 కోట్లు మంజూరైనా స్థల సమస్యతో ప్రాజెక్టు ముందుకు సాగలేదన్నారు.
సామాజిక భద్రతా పింఛన్ల విషయంలో కూడా నిరాశాజనక పరిస్థితులు నెలకొన్నాయని రమణరాజు పేర్కొన్నారు. 41,500 పింఛన్ల పరిశీలనలో ఖాళీ అయిన 1,150 పింఛన్లను కొత్త అర్హులకు మంజూరు చేయలేదని, 1,800 మంది వితంతువులు, 1,500 మంది వృద్ధులు, 800 మంది దివ్యాంగులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ కేవలం 650 మందికే గుర్తింపు కార్డులు జారీ చేశారని తెలిపారు.
రూ.25 కోట్లతో ప్రతిపాదించిన కార్పొరేషన్ పరిపాలనా భవనం నిర్మాణం నిలిచిపోయిందని, టూటౌన్ ఓవర్‌బ్రిడ్జి, ఎన్టీఆర్ బ్రిడ్జి రైలింగ్‌లు గత నాలుగేళ్లుగా శిథిలావస్థలోనే ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉప్పుటేరుపై ప్రతిపాదించిన మూడో వంతెన నిర్మాణానికి సంబంధించిన కన్సల్టెన్సీ నివేదిక, సాంకేతిక, ఆర్థిక అనుమతులు, భూసేకరణ, టెండర్ల ప్రక్రియ ఇప్పటికీ పూర్తికాలేదని పేర్కొన్నారు.
అలాగే నగరపాలక సంస్థకు ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సిన రూ.42.80 కోట్ల ఆస్తి పన్ను, రూ.31.67 కోట్ల జనరల్ నిధుల బకాయిలు ఇప్పటికీ వసూలు కాలేదని, కాగ్ నివేదికలో ఈ అంశాలు ప్రస్తావించినప్పటికీ చర్యలు కనిపించడం లేదని విమర్శించారు.
రానున్న ఏడాదిలోగా పెండింగ్ అభివృద్ధి పనులను పూర్తి చేయకపోతే ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం దెబ్బతింటుందని, చివరి ఏడాదిలో చేపట్టే పనులతో అభివృద్ధి లోటు భర్తీ చేయడం సాధ్యం కాదని దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు.








