contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

“ఫ్లెక్స్ ఫ్రీ సిటీ” ఉత్తర్వులు అమలవుతున్నాయా?

కాకినాడ : కాకినాడను “ఫ్లెక్స్ ఫ్రీ సిటీ”గా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు ఆరోపించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ బోర్డులను మీడియా దృష్టికి తీసుకువస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

నగరంలోని సినిమా రోడ్, మెయిన్ రోడ్, జగన్నాథపురం, వెంకటేశ్వరస్వామి ఆలయ రహదారి, చర్చి స్క్వేర్, స్కూల్ ఏరియా, కలెక్టరేట్ రోడ్, భానుగుడి, పిఠాపురం రోడ్ తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో ఫ్లెక్స్ బోర్డులు విచ్చలవిడిగా ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా కల్పన సెంటర్ నుంచి పేర్రాజుపేట వంతెన వరకు భారీ ఫ్లెక్స్‌లు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమీపంలోనే ఫ్లెక్స్ బోర్డులు వేలాడుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరమని రమణరాజు అన్నారు. “ఫ్లెక్స్ ఫ్రీ సిటీ”గా ప్రకటించిన తర్వాత కూడా ఉత్తర్వుల అమలు ఇదేనా అని ఆయన ప్రశ్నించారు.

కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసిన అనంతరం గోదావరి కళాక్షేత్రం, సూర్య కళామందిరంలో వేర్వేరు రోజుల్లో జరిగిన అధికార, రాజకీయ పార్టీల కార్యక్రమాల సందర్భంగా కూడా రోడ్లపై భారీ ఫ్లెక్స్ బోర్డులు ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు. అనుమతులు లేకుండా ఇలాంటి ఫ్లెక్స్‌లు ఏర్పాటు చేయడాన్ని ఉపేక్షిస్తే ఇతరులు కూడా అదే విధానాన్ని అనుసరించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు సమానంగా గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని రమణరాజు పేర్కొన్నారు. నగరంలో అనుమతి లేని ఫ్లెక్స్ బోర్డుల ఏర్పాటుపై వెంటనే ప్రత్యేక చర్యలు చేపట్టి, “ఫ్లెక్స్ ఫ్రీ సిటీ” లక్ష్యాన్ని కఠినంగా అమలు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆయన డిమాండ్ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :