contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మేడలైన్ భారీ వంతెన .. అక్రమమా ! సక్రమమా !

కాకినాడ : కాకినాడ ఉప్పుటేరులో మేడలైన్ ప్రాంతంలో నిర్మాణం పూర్తిచేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రైవేట్ వంతెనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు డిమాండ్ చేశారు. కాకినాడ కలెక్టరేట్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం, ఆరు రోడ్ల కూడలి సమీపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మేడలైన్ వంతెన నిర్మాణం చట్టబద్ధంగా జరిగిందా, లేక అక్రమంగా చేపట్టారా అనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. ఈ నిర్మాణానికి కేంద్ర జల సంఘం నిబంధనలు పాటించారా లేదా అనే విషయాన్ని ప్రజలకు వెల్లడించాలని అన్నారు.

దశాబ్దిన్నర కాలంగా మూడు ప్రభుత్వాల హయాంలో రాజకీయ పలుకుబడితో ఈ నిర్మాణం కొనసాగిందని, బకింగ్‌హామ్ కెనాల్‌కు సంబంధించిన భూ రికార్డులను తారుమారు చేసి పనులు జరిపించారని రమణరాజు ఆరోపించారు. రాష్ట్ర విభజన తర్వాత కొందరు అధికారులు రికార్డులను ట్యాంపరింగ్ చేసి నిర్మాణానికి సహకరించారని కూడా ఆయన విమర్శించారు.

ఇటీవల కలెక్టరేట్‌లో ఏసీబీ దాడులు జరిగిన నేపథ్యంలో ఈ వంతెన నిర్మాణంపై కూడా న్యాయ విచారణ జరిపిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం వంతెన అప్రోచ్ పనులు పూర్తి చేసి విద్యుత్ కనెక్షన్లు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇప్పటికే అత్యంత రద్దీగా ఉండే ఆరు రోడ్ల కూడలికి ఆనుకుని ఈ వంతెనను ఏడో రహదారిలా అనుసంధానం చేయడం ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధమని రమణరాజు ఆరోపించారు. ఈ వంతెన ప్రారంభమైతే ట్రాఫిక్ రద్దీ మరింత పెరిగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

మేడలైన్ ప్రాంతంలోని ప్రభుత్వ భూములు, పోరంబోకు, కాలిబాటలు, పంట బోదెలు, ఇతర ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలని ఆయన కోరారు. ఆ ప్రాంతంలో పేదల కోసం గృహ నిర్మాణాలు, తీర ప్రాంత కార్మికులకు తక్కువ అద్దెతో గృహ సముదాయాలు, జర్నలిస్టుల కాలనీ వంటి ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

మేడలైన్ రియల్ ఎస్టేట్ అభివృద్ధి పేరిట భారీ ఆర్థిక లావాదేవీలు జరిగాయని, ఈ నిర్మాణం వెనుక రాజకీయ, అధికార వర్గాల ప్రమేయంపై సమగ్ర దర్యాప్తు అవసరమని ఆయన ఆరోపించారు. అలాగే ప్రభుత్వ అనుమతులు లేకుండా కాలువలపై ఇతర ప్రాంతాల్లో కూడా మినీ వంతెనలు నిర్మిస్తున్న పరిస్థితి ఆందోళనకరమని అన్నారు.

ఈ వంతెన వల్ల కాకినాడ నగరంలో వరద ముంపు సమస్య మరింత తీవ్రం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల ప్రాణ భద్రత, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ దృష్ట్యా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధులు ఈ అంశంపై బాధ్యతాయుతంగా స్పందించి పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని రమణరాజు డిమాండ్ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :