కాగజ్‌నగర్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహణపై తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బార్‌కు మంజూరైన లైసెన్స్ నిబంధనలను ఉల్లంఘిస్తూ, పక్కనే ఉన్న మరో భవనంలో వైన్స్ దుకాణాన్ని నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
స్థానికుల కథనం ప్రకారం, గత కొంతకాలం వరకు నిబంధనలకు అనుగుణంగా నడిచిన ఈ బార్‌లో గత రెండు నెలలుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెబుతున్నారు. ఒకే లైసెన్స్‌తో బార్ నిర్వహణకు అనుమతి పొందిన యాజమాన్యం, ఎలాంటి ప్రత్యేక అనుమతులు లేకుండానే సమీపంలోని మరో భవనంలో మద్యం విక్రయాలు చేపడుతోందని ఆరోపిస్తున్నారు.
అంతేకాకుండా, రహదారి పక్కనే ఏర్పాటు చేసిన ఆ దుకాణం వద్ద “M.R.P. ధరలకే మద్యం లభించును” అంటూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బహిరంగంగా విక్రయాలు కొనసాగిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. బార్, వైన్స్ దుకాణం రెండూ ఒకే యాజమాన్య ఆధ్వర్యంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నప్పటికీ సంబంధిత ఎక్సైజ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని విమర్శిస్తున్నారు.
అధికారుల కళ్ల ముందే ఇలాంటి అక్రమాలు కొనసాగుతున్నా ఎందుకు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి, వాస్తవాలను వెలికితీసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.








