సింగరేణి సంస్థ పరిరక్షణే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం రామగుండం రీజియన్ ఆర్జీ-1 పరిధిలో నిర్వహించిన “సింగరేణి భరోసా యాత్ర” లో ఆయన పాల్గొని కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు.
రామగుండం ఆర్జీ-1 ఓసీపీ-5 గనికి చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సింగరేణి కార్మికులు, ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణకు గుండెచప్పుడు వంటి సింగరేణి సంస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురిచేశాయని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం, కాంగ్రెస్ పాలకులు సింగరేణిని తమ సొంత ఖజానాలా ఉపయోగించుకున్నారని ఆరోపించారు. కార్మికుల చెమటతో ఎదిగిన సంస్థను భారీ అప్పుల ఊబిలోకి నెట్టి, దాని భవిష్యత్తును సంక్షోభంలోకి నెట్టేశారని అన్నారు.
సింగరేణి నుంచి బొగ్గు కొనుగోలు చేసి విద్యుత్ వినియోగించిన రాష్ట్ర ప్రభుత్వం సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించలేదని ఆయన పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు రూ.30 వేల కోట్ల బకాయిలు ఉంచగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మరో రూ.24 వేల కోట్లు జోడించిందని, మొత్తంగా రూ.54 వేల కోట్ల బకాయిలతో సింగరేణి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆరోపించారు.
కేసీఆర్ హయాంలో సింగరేణి బోర్డును నామమాత్ర సంస్థగా మార్చి, టెండర్ల పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారని కిషన్ రెడ్డి విమర్శించారు. తాను రాజకీయాల కోసం రాలేదని, సింగరేణి పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు సంస్థ ఆదాయాన్ని ఫుట్‌బాల్ మ్యాచ్‌లు వంటి అనవసర కార్యక్రమాలకు మళ్లించాయని ఆయన ఆరోపించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సింగరేణికి తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ను కేటాయించి సంస్థ భవిష్యత్తుకు భరోసా కల్పించామని తెలిపారు. సింగరేణి మనుగడ కోసం ఎలాంటి అడ్డంకులు ఎదురైనా కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, కార్మికుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉంటామని మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సింగరేణి కార్మికులు, ఉద్యోగులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








