జగిత్యాల : జగిత్యాల జిల్లా కోరుట్లలో అమాయక ప్రజలను, ముఖ్యంగా వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దృష్టి మళ్లించి బంగారు ఆభరణాలు అపహరిస్తున్న ముగ్గురు అంతర్జిల్లా దొంగల ముఠాను కోరుట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు 24 గ్రాముల బరువున్న లక్ష్మీదేవి బిళ్లల బంగారు గొలుసుతో పాటు ఒక రియల్మీ మొబైల్ ఫోన్, ఒక శాంసంగ్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, అరెస్టైన నిందితులు అల్లెపు కృష్ణ (51), కుంచెపు శ్రీకాంత్ (30), అల్లెపు రాజ్‌కుమార్ (28)లు సిద్దిపేట జిల్లాకు చెందినవారు. తమ స్వస్థలంలో గుర్తుపడే అవకాశం ఉండటంతో ఇతర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడాలని భావించిన వీరు ఈ నెల 15న కోరుట్లకు చేరుకుని స్థానిక లాడ్జిలో బస చేశారు.
మరుసటి రోజు కోరుట్ల బస్టాండ్ పరిసరాల్లో వృద్ధులను లక్ష్యంగా చేసుకున్న నిందితులు, సుమారు 70 ఏళ్ల వృద్ధురాలిని పరిచయం చేసుకుని ఆమె పెన్షన్‌ను రూ.2,000 నుంచి రూ.4,000కు పెంచిస్తామని నమ్మించారు. అనంతరం ఆమెను ఎస్బీఐ బ్యాంకు సమీపానికి తీసుకెళ్లి, బంగారు ఆభరణాలు ధరించి ఉంటే పెన్షన్ మంజూరు కాదని మాయమాటలు చెప్పారు. దీంతో వృద్ధురాలి మెడలో ఉన్న లక్ష్మీదేవి బిళ్లల బంగారు గొలుసును తీసుకుని, పెన్షన్ దరఖాస్తు ఫారాలు తీసుకొస్తామని చెప్పి అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ ఘటన అనంతరం మరిన్ని దొంగతనాలకు పాల్పడే ఉద్దేశంతో అదే లాడ్జిలో ఉంటున్న నిందితుల కదలికలపై నిఘా పెట్టిన కోరుట్ల పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. విచారణలో ప్రధాన నిందితుడు అల్లెపు కృష్ణపై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో 100కు పైగా కేసులు నమోదై ఉన్నట్లు తేలింది. మిగతా ఇద్దరు నిందితులపై కూడా పలు దొంగతనాల కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ప్రజలకు పోలీసుల హెచ్చరిక
ప్రభుత్వ పథకాలు, పెన్షన్ పెంపు, బ్యాంకు సేవల పేరుతో అపరిచితులు సంప్రదిస్తే వెంటనే అప్రమత్తం కావాలని కోరుట్ల పోలీసులు సూచించారు. తెలియని వ్యక్తులకు బంగారు ఆభరణాలు లేదా విలువైన వస్తువులు అప్పగించవద్దని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.








