మెట్‌పల్లి : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా బాలింతలు, గర్భిణులకు తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జగిత్యాల జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి ప్రాజెక్టు సీడీపీవో పద్మ ముఖ్య అతిథిగా పాల్గొని తల్లిపాల విశిష్టతను వివరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారమని, బిడ్డ పుట్టిన వెంటనే ముర్రు పాలు (కొలస్ట్రం) తప్పనిసరిగా తాగించాలని సూచించారు. ముర్రు పాలలో ఉండే పోషకాలు శిశువు రోగనిరోధక శక్తిని పెంపొందించి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు దోహదపడతాయని చెప్పారు.
బిడ్డ పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అదనపు ఆహారం లేదా ఇతర పానీయాలు ఇవ్వకూడదని ఆమె సూచించారు. తల్లిపాలు తీసుకునే పిల్లలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదుగుతారని పేర్కొన్నారు. అలాగే తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయని వివరించారు.
జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలోని 1,065 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహార పథకాలను గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సీడీపీవో పద్మ కోరారు.
ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.








