అమరావతి : భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ వాగ్వాదం కొనసాగుతున్న వేళ, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ ప్రాజెక్టు క్రెడిట్ టీడీపీకీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకీ కాదని, అసలు క్రెడిట్ జీఎంఆర్ సంస్థకే చెందుతుందని ఆయన సోషల్ మీడియాలో చేసిన సుదీర్ఘ పోస్టులో పేర్కొన్నారు.
“భోగాపురం క్రెడిట్ ఎవరిది?” అనే శీర్షికతో చేసిన పోస్టులో ప్రాజెక్టు రూపకల్పన నుంచి ప్రారంభోత్సవం వరకు జరిగిన పరిణామాలను వరుసగా ప్రస్తావించారు. “కొట్టుకోవడం ఆపండి… ఆ క్రెడిట్ జీఎంఆర్‌ది” అంటూ తన పోస్టును ప్రారంభించిన ఆయన, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అవసరానికి మించి 5 వేల ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారని, దీంతో భూములు కోల్పోతున్న రైతుల ఆందోళనలకు అప్పటి ప్రతిపక్షం మద్దతు తెలిపిందని పేర్కొన్నారు. అనంతరం భూసేకరణను 3 వేల ఎకరాలకు తగ్గించినట్లు గుర్తు చేశారు.
ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియలో తొలుత ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) బిడ్ గెలుచుకున్నప్పటికీ, జీఎంఆర్ కోసం ఆ టెండర్‌ను రద్దు చేశారని ఆయన ఆరోపించారు. అప్పటి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఆ నిర్ణయానికి అంగీకరించాల్సి వచ్చిందని, అనంతరం నిబంధనలు సవరించి జీఎంఆర్‌కు ప్రాజెక్టును అప్పగించారని తన పోస్టులో పేర్కొన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం విమానాశ్రయ పనులు నిలిచిపోయాయని, అనంతరం కాకినాడ సెజ్‌లో జీఎంఆర్ వాటాలను అరబిందో సంస్థకు బదలాయించే ఒప్పందంలో భాగంగా 2023లో పనులకు మళ్లీ అనుమతులు లభించాయని ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవతో పనులు వేగవంతమయ్యాయని కూడా ఆయన తన పోస్టులో ప్రస్తావించారు.
విమానాశ్రయానికి అనుసంధాన రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోందని పేర్కొన్న ఆయన, ప్రభుత్వం విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని “ఒక షాపింగ్ మాల్ ప్రారంభించినంత హడావుడిగా” ప్రచారం చేస్తోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అదే సమయంలో విజయవాడ విమానాశ్రయం అభివృద్ధిపై తగిన దృష్టి పెట్టలేదని, ఇప్పటికీ రోజువారీ అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రాకపోవడం విచారకరమని అభిప్రాయపడ్డారు.
తన పోస్టు ముగింపులో “వాట్సాప్ యుగంలో ప్రజల జ్ఞాపకశక్తిని తక్కువ అంచనా వేస్తున్నారు. అందుకే జరిగిన పరిణామాలను ఒక వరుసలో గుర్తు చేశాను. ఇప్పుడు మీరే నిర్ణయించుకోండి… భోగాపురం భోగం ఎవరిది? క్రెడిట్ ఎవరిది?” అంటూ ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు.
అయితే, ఏబీ వెంకటేశ్వరరావు చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయాలుగా సోషల్ మీడియాలో వెలువడినవే కాగా, వాటిపై సంబంధిత రాజకీయ పార్టీలు అధికారికంగా స్పందించాల్సి ఉంది.








