విజయనగరం : భోగాపురంలో నిర్మించిన శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన అధికారిక పేరు, ప్రచార సామగ్రిలో విజయనగరం జిల్లా పేరును స్పష్టంగా చేర్చాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు స్థానిక ప్రజల తరఫున వినతిపత్రం సమర్పించారు.
వినతిపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం, 2026 ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురంలో నిర్మించిన శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారని, ఈ విమానాశ్రయం పూర్తిగా విజయనగరం జిల్లా పరిధిలోనే నిర్మాణం పొందినప్పటికీ, లోగోలు, ప్రచారాలు, అధికారిక సంస్థల పేర్లలో “విశాఖ శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం – జి.ఎం.ఆర్.”గా పేర్కొనడం జిల్లా ప్రజల మనోభావాలను దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే విమానాశ్రయం నిర్మాణం కోసం భూములు ఇచ్చిన 405 కుటుంబాలు ఇప్పటికీ పూర్తి స్థాయి పునరావాసం, శాశ్వత ఉపాధి కోసం ఎదురుచూస్తున్నాయని వినతిపత్రంలో పేర్కొన్నారు. ప్రాజెక్టు అభివృద్ధిలో భాగస్వాములైన భూ నిర్వాసిత కుటుంబాలకు న్యాయం చేయడంతో పాటు, స్థానిక యువతకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.
ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి పలు డిమాండ్లు వినిపించారు. విమానాశ్రయం అధికారిక పేరు, లోగోలు, ప్రచార సామగ్రిలో “భోగాపురం/విజయనగరం శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం” అని స్పష్టంగా పేర్కొనాలని, “విశాఖ” లేదా “జి.ఎం.ఆర్.” పేర్లతో ఉన్న ప్రచారాలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా, భూములు ఇచ్చిన 405 కుటుంబాలకు తక్షణమే పునరావాస కాలనీ ఏర్పాటు చేసి, ప్రతి కుటుంబానికి ఐదు సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయించాలని, రైతు కుటుంబాలకు శాశ్వత ఉద్యోగాలు ఇవ్వాలని, విమానాశ్రయం మరియు అనుబంధ ప్రాజెక్టుల్లో విజయనగరం జిల్లాకు చెందిన స్థానిక యువతకు ప్రాధాన్యతతో ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
భూ నిర్వాసితులు, స్థానిక ప్రజల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని వినతిపత్రంలో కోరారు.








