గుంతకల్ : ఆలయాలను సాంస్కృతిక శిక్షణ కేంద్రాలుగా అభివృద్ధి చేయడంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సహా రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో నిర్వహించే సాంస్కృతిక ప్రదర్శనల ఎంపికకు పారదర్శక విధానం రూపొందించాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు “జనతా వారధి” కార్యక్రమంలో భాగంగా గుంతకల్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శ్రీనివాసులకు వినతిపత్రాన్ని సమర్పించారు.
జనతా వారధి డివిజన్ కన్వీనర్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు జీలకర్ర విక్రమ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఈ వినతిపత్రాన్ని అందజేశారు. ఆలయాలు కేవలం పూజా కార్యక్రమాలకే పరిమితం కాకుండా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, ఆధ్యాత్మిక విలువలను భావితరాలకు అందించే కేంద్రాలుగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.
వినతిపత్రంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భజన మండళ్లు, కోలాట బృందాలు, హరికథకులు, కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్రనాట్యం, బుర్రకథ, చెక్కభజన, ఒగ్గుకథ, యక్షగానం, తోలుబొమ్మలాట, ధింసా నృత్యం, పులివేషం, గంగిరెద్దుల ఆట, నాగస్వర–మంగళ వాయిద్య కళాకారులు, వేద పారాయణం, అన్నమాచార్య, త్యాగరాజ, రామదాసు కీర్తనల గాయకులు తదితర సంప్రదాయ కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు.
బీజేపీ నాయకులు ప్రధానంగా రెండు కీలక డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. మొదటిగా దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో ఉచిత సాంస్కృతిక శిక్షణ కేంద్రాలను దశలవారీగా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం కనీసం గంటపాటు శిక్షణ నిర్వహించడం, స్థానిక అర్హత కలిగిన కళాకారులను పార్ట్‌టైమ్ శిక్షకులుగా నియమించి వారికి తగిన పారితోషికం చెల్లించడం, శిక్షణ పూర్తి చేసిన వారికి ధ్రువపత్రాలు, ఆలయ ఉత్సవాల్లో ప్రదర్శన అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
రెండో డిమాండ్‌గా టీటీడీ బ్రహ్మోత్సవాలు, ఇతర ప్రధాన ఆలయాల వార్షిక ఉత్సవాలు, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని కార్యక్రమాల్లో పాల్గొనే కళాకారుల ఎంపికకు రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన పారదర్శక విధానాన్ని అమలు చేయాలని కోరారు. దీనివల్ల ప్రతిభావంతులైన కళాకారులకు సమాన అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు.
జిల్లాలోని ఆలయాలను సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి, సంప్రదాయ కళల పరిరక్షణకు జీవంతమైన కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ఈ రెండు అంశాలపై సమగ్ర విధానాన్ని రూపొందించి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్డీవో ద్వారా కోరినట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు, ఎఫ్‌సీఐ స్టేట్ డైరెక్టర్ వనగొంది విజయలక్ష్మి, జనతా వారధి కో-కన్వీనర్, మండల వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్, బీజేపీ సీనియర్ నాయకుడు బండారి కృష్ణమూర్తి, బజరంగ్ దళ్ రాష్ట్ర కో-కన్వీనర్ కసాపురం రవి, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, పాత గుంతకల్ మహిళా మోర్చా అధ్యక్షురాలు లావణ్యతో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








